రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. latest telugu news..
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో చాలా దేశాలు రష్యా కు వ్యతిరేకంగా ఓటు వేయగా భారత్ మాత్రం తటస్థంగా ఉంది. దీనిపై మూడు సార్లు ఓటింగ్ నిర్వహించగా భారత్ అదే వైఖరిని కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్ దేశాలు భారత్ పైన ఆంక్షలు విధించేందుకు సిద్ధపడిన అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుతం రష్యా పై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏ దేశం కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సాహసం చేయడం లేదు. అయితే, భారత్ చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడంతో రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తమ వద్ద కొనుగోలు చేస్తే చవకగా అందిస్తామని పేర్కొనడంతో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రష్యా చమురు కంపెనీ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇది రష్యా ప్రభుత్వం తో చేసుకున్న ఒప్పందం కాదని, ఓ కంపెనీ మరో కంపెనీ తో చేసుకున్న ఒప్పందం గా చూడాలని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కంపెనీ నుంచి ఐవోసీఎల్ 3 మిలియన్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోనుంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులపై అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆంక్షలు విధించినా దీని ప్రభావం భారత చమురు కంపెనీలపై పడలేదు. అందుకే భారతీయ చమురు కంపెనీలు రష్యా ఇంధన సంస్థల నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నాయి.