మహిళల్లో ఎండోమెట్రియోసిస్.. ఎదుర్కోవడం ఎలా?

దిశ, ఫీచర్స్ : మహిళలను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో 'ఎండోమెట్రియోసిస్' ఒకటి.

Update: 2022-04-06 06:42 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో 'ఎండోమెట్రియోసిస్' ఒకటి. భారతదేశంలో ప్రతీ 10 మంది స్త్రీలలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 'చాక్లెట్ సిస్ట్' గా పిలువబడే ఈ ప్రమాదకరమైన వ్యాధి నిర్ధారణ, లక్షణాలు గుర్తించేందుకు ఒక్కోసారి పదేళ్ల సమయం కూడా పట్టవచ్చు. ఇది స్త్రీలలో అండాశయ క్యాన్సర్‌ అవకాశాలను పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

'ఎండోమెట్రియోసిస్' కండిషన్‌లో మహిళలు దీర్ఘకాలిక నొప్పిని ఎదుర్కోవడమే కాక వారిలో మాతృత్వానికి ముప్పు కలిగిస్తుందని పుణె మదర్‌హుడ్ హాస్పిటల్‌ గైనకాలజిస్ట్ డాక్టర్ సుశ్రుత మొకడమ్ వెల్లడించారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల ద్వారా ప్రభావితమయ్యే ఈ స్థితి బాధిత మహిళల రోజువారీ దినచర్యకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ స్థితిలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జీవనశైలి, ఆహార మార్పులను సూచించారు.

ఎండోమెట్రియోసిస్ సాధారణ లక్షణాలు..

ఈ రుగ్మతతో బాధపడుతున్న మహిళల్లో కటి, నడుము భాగంలో నొప్పితో కూడిన పెయిన్‌ఫుల్ పీరియడ్స్, సంభోగ సమయంలో లేదా ఆ తర్వాత నొప్పి, అధిక రక్తస్రావం, జీర్ణ సమస్యలు, బాధాకరమైన మూత్రవిసర్జన, అలసట, ఆందోళన, పొత్తి కడుపు ఉబ్బరం, వికారం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇక 'ఎండోమెట్రియం' గా పిలువబడే గర్భాశయ ఇన్నర్ లైనింగ్ అనేది ఈ పరిస్థితుల్లో గర్భాశయం వెలుపల ఫెలోపియన్ ట్యూబ్స్, యోని, గర్భాశయం లేదా మూత్రాశయం లేదా పెద్ద పేగు చివరి భాగంలో పెరుగుతుంది. స్త్రీలకు వీటి గురించి పెద్దగా అవగాహన ఉండకపోవడంతో నిర్ధారణ ఆలస్యమై వారి జీవన నాణ్యత దెబ్బతింటుంది.

డైట్..

తినవలసిన ఆహారాలు : కూరగాయలు, ధాన్యాలు, ఫైబర్, గింజలు, చిక్కుళ్లు, మిల్లెట్స్. వాల్‌నట్, ఫ్లాక్స్, చియా గింజలు, సాల్మన్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకర కొవ్వులు/ఒమేగా 3 ఫుడ్స్. కూరగాయల్లో లభించే కలిగిన బి విటమిన్. పసుపు, నిమ్మ, కొబ్బరి నూనె వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్. గుడ్లు, చేపలు, ఆకుకూరలు వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభించే ఆహారాలు.

నివారించాల్సిన ఆహారాలు : ప్రిజర్వేటివ్స్‌, మోనోసోడియం గ్లుటామేట్, కెఫిన్, కోలాస్, ఆల్కహాల్, రెడ్ మీట్, అధిక కొవ్వు పదార్థాలు, చక్కెర పదార్థాలతో ప్రాసెస్ చేయబడిన ఆహారాలు.

శారీరక వ్యాయామం..

ఇది నొప్పి, ఒత్తిడి వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్రమతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. నడక, యోగా, స్విమ్మింగ్, ఏరోబిక్స్ లేదా సైక్లింగ్ ప్రయత్నించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల తగినంత బరువు మెయింటైన్ చేయవచ్చు.

నాణ్యమైన నిద్ర

నిద్ర లేమి ఎండోక్రైన్ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఇది హార్మోన్ స్రావాలకు సంబంధించిన విధానాలలో మార్పు కు దారితీస్తుంది. అందుకే డైలీ కనీసం 8 గంటలు నిద్రపోయేందుకు ప్రయత్నించండి.

హోలిస్టిక్ హీలింగ్ : ఒత్తిడిని జయిస్తే సానుకూల జీవనం గడపవచ్చు.

Tags:    

Similar News