మన సెంటర్ ​గుజరాత్‌కు పాయే...

భారతీయ సాంప్రదాయ వైద్యం, మందులు తయారీ, రీసెర్చ్​ల కొరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్​లో ఏర్పాటు చేయాలనుకున్న

Update: 2022-03-10 17:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :భారతీయ సాంప్రదాయ వైద్యం, మందులు తయారీ, రీసెర్చ్​ల కొరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్​లో ఏర్పాటు చేయాలనుకున్న ' గ్లోబల్​ సెంటర్​ ఆఫ్​ ట్రెడిషనల్​ మెడిసిన్​(జీసీటీఎం)' ను కేంద్రం గుజరాత్​కు తరలించింది. జామ్​నగర్‌లో ట్రెడిషనల్​మెడిసిన్​సెంటర్​ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో రాష్ట్ర సర్కార్​షాక్‌లో ఉన్నది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్​కు కేటాయిస్తున్నామని, అందుకు అవసరమైన ల్యాండ్​ ఇవ్వాలని గతంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఐడీపీఎల్ ఏరియాలో ఇవ్వాలని కోరారు. అయితే అది గ్రీన్​జోన్‌లో ఉన్నందున ట్రెడిషనల్​మెడిసిన్​ సెంటర్‌కు అనువైన స్థలం వేరే చోట ఉచితంగా ఇస్తామని మంత్రి హరీష్​రావు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కానీ కేంద్రం వెంటనే ఆ సెంటర్‌ను గుజరాత్‌కు తీసుకువెళ్లిపోయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ అడియాశలయ్యాయి.

సిద్ధంత పరంగా, పార్టీ ల మధ్య రాజకీయ విభేదాలు ఉండాలి కానీ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలా చేయడం అన్యాయమని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన గుర్తుచేశారు.

పరిశోధనలకు అనువైన ఏరియా...

హైదరాబాద్‌లో ఇప్పటికే సీసీఎంబీ, సీఎస్‌ఐఆర్‌, డీఆర్డీవో, ఎన్‌ఐఎన్‌, ఐఐసీటీ, ఎఫ్‌డీటీఆర్సీ వంటి శాస్త్ర పరిశోధన సంస్థలు ఉన్నాయి. దీంతో జీసీటీఎం వచ్చి ఉంటే మెడికల్​ రీసెర్చ్​లో అభివృద్ధి పెరిగేది. ఇప్పటికే హైదరాబాద్​ మెడికల్​ హబ్‌గా ఉన్నది. ఈ కేంద్రం నెలకొల్పడం వలన రాబోయే రోజుల్లో మెడికల్​ వ్యవస్థ మరింత బలోపేతమై ప్రజలకు సులువైన వైద్యం అందించేందుకు ఉపయోగపడేది. స్వయంగా కేంద్ర మంత్రికి కిషన్​రెడ్డికి విన్నపించినా జీసీటీఎం రాలేదని ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేబినెట్‌ నిర్ణయంతో కిషన్‌ రెడ్డికి కేంద్రంలో ఉన్న పరపతి ఏమిటో తేలిపోయిందంటూ టీఆర్‌ఎస్‌ నేతలు, నెటిజన్లు సోషల్​ మీడియాల్లో కామెంట్లు చేయడం గమనార్హం.

Tags:    

Similar News