ఉపాధి హామీ పథకంలో ఆ లీడర్ల జోక్యానికి ఫుల్ స్టాప్..

Update: 2022-04-02 14:00 GMT

దిశ, పెద్దేముల్‌ : జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకువచ్చిన కొత్త విధానంతో లోకల్ లీడర్ల జోక్యం, అవినీతికి చెక్ పడింది. అధికార పార్టీకి చెందిన స్థానిక లీడర్లు సంబంధిత ఈజీఎస్ అధికారులు సిబ్బందిపై ఒత్తిళ్లు తెచ్చి ఉపాధి హామీ పథకాన్ని పట్టించారన్న ఆరోపణలు వినిపించేవి.. బినామీ జాబు కార్డులు సృష్టించడం పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు తయారు చేయడం, పెద్ద మొత్తంలో కూలీల పేరిట డబ్బులు స్వాహా చేయడం ఈజీఎస్లో సాధారణంగా జరిగేదే.. ఈ తతంగంపై నిఘా పెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. అక్రమాలకు ఎన్ఎంఎంఎస్‌తో చెక్ పెట్టింది.

ఇప్పటివరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వారు తయారుచేసిన సాఫ్ట్‌వేర్ ను పక్కనబెట్టి, పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్)ను తెరపైకి తీసుకువచ్చింది. మార్చి ఒకటి నుంచి ఎన్ఎంఎంఎస్ ద్వారానే ఉపాధి కూలీలు ప్రతిరోజూ రెండుసార్లు ఫొటోలు దిగి వారి అటెండెన్స్‌ను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. రియల్ టైమ్ అటెండెన్స్ పేరిట చేపట్టిన ఈ సిస్టమ్ కు జియో ట్యాగ్ చేస్తున్నారు. ఈ విధానంతో అవకతవకలకు లీడర్ల అక్రమాలకు పూర్తిగా చెక్ పడిందని చెప్పొచ్చు.

ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే చోట నుంచి ప్రతి రోజూ ఉదయం పదకొండు గంటలకు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల్లోపు ఫొటోలు దిగి ఎన్ఎంఎంఎస్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రెండుసార్లు ఫోటోలు తీసి హాజరు వేసుకున్న వారికి వేతనాలను చెల్లిస్తారు. ఈ డబ్బులు కూడా డైరెక్ట్‌గా కూలీల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి. ఈ విధానంతో జాబ్ కార్డులున్న లోకల్ లీడర్ల పెత్తనానికి ముగింపు పలికినట్లయింది.

పనుల వివరాలు పొందుపరచాల్సిందే..

ఈజీఎస్ కింద చేపట్టే పనుల విషయంలో కూడా అనేక ఫిర్యాదులు అందేవి. దీనికి కూడా చెక్ పెట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎం సిస్టమ్ ఉపయోగిస్తుంది. కూలీల పేర్లు ఎంతవరకు పని పూర్తి చేస్తాడని వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీనిని అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శులు వెనువెంటనే వెబ్‌సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ రోజు ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు..? ఏ పనులు చేస్తున్నారు..? అన్న వివరాలు ఎప్పటికప్పుడు ఫోటోల ద్వారా అధికారులకు తెలిసిపోతుంది. మండలంలో 19,900మందికి జాబు కార్డులు కలిగి ఉంటే, ఉపాధి పనుల్లో 8900 మంది పనులు చేసేవారు. ఈ సంవత్సరం ఉపాధి పనులు శుక్రవారంతో మొదలయ్యాయి. గత సంవత్సరంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కూలీలకు గ్రామ పంచాయతీ తరఫున నీటి వసతి, కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మెడికల్ కిట్లను ఏర్పాటు చేస్తున్నారు.

అవకతవకలకు తావు లేదు.. : నర్సింలు ఏపీవో, పెద్దేముల్‌.

పెద్దేముల్ మండలంలో ప్రస్తుతం 40మంది ఎన్ఎంఎంఎస్ లను నియమించాము. మరో 40 మంది తీసుకునే ఆలోచనలో ఉన్నాం. గతంలో ఉన్న సాఫ్ట్‌వేర్ తో పోలిస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సాఫ్ట్‌వేర్ చాలా మెరుగ్గా ఉంది. గతంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఆడిట్ లో తెలిసిపోయేది. ప్రస్తుతం అలా జరిగే అవకాశాలు లేవు.

Tags:    

Similar News