నిప్పుతో అడవికి ముప్పు.. కాపాడేవారే లేరా ?
దిశ, ములుగు: ములుగు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. అలాంటి అటవీ సంపదకి వేసవికాలంలో
దిశ, ములుగు: ములుగు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. అలాంటి అటవీ సంపదకి వేసవికాలంలో నిప్పుతో ముప్పు ఏర్పడి పెద్ద ఎత్తున తగలబడుతోంది. ములుగు జిల్లా అంటేనే అటవి సంపదకు పెట్టింది పేరు. జిల్లాలోని గోవిందరావుపేట్, తాడువాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో ఎక్కువ సంఖ్యలో అడవులు విస్తరించి, ఎన్నో అరుదైన వృక్ష జాతి చెట్లు, అరుదైన అడవి జంతువులకు నెలవుగా ఉంది. కానీ, వేసవి కాలం వచ్చేసరికి ఎక్కువ చెట్లకు ఆకురాల్చే కాలం కావడంతో అటవీ మొత్తం రాలిన ఆకులతో విస్తరించి, చిన్న నిప్పు పడిన మంటలు చెలరేగి అడవిని అంతా కాల్చే ప్రమాదం ఉంది. గత వారం రోజుల నుంచి పస్రా- తాడ్వాయి , తాడువాయి- ఎటునాగారం మధ్య గల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగి వ్యాపిస్తున్నాయి. అడవి లో మంటలు అడ్డుకోవడానికి మానవ తప్పిదాల అయిన అటవీ ప్రాంతంలో వంట చేసుకుని తర్వాత నిప్పుని చల్లార్చ కుండా వెళ్లిపోవడం, అడవిలో సిగరెట్, బీడీ లాంటివి వెలిగించి పారేయటం లాంటి అనర్ధాలకు ఎక్కువశాతం అడవులకు మంటలు అంటుకున్నాయి. అడవి ప్రాంతంల్లో ఒక్క చోట నిప్పు రాజేసిన మంటలు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని చుట్టుముట్టి దహనం చేసే ప్రమాదం ఉంది. ఇలా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అడవిలో మంటలు చెలరేగడం పరిపాటిగా మారింది. ఇదే తంతు కొనసాగితే అడవిలో విలువైన వృక్ష సంపద జంతు సంపద అంతరించిపోయే అవకాశాలు ఉంటాయని ప్రకృతి ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించడం వల్ల అడవిలో అరుదైన వృక్ష సంపదకు ముప్పు వాటిల్లుతోంది, అటవీ జంతువులు సైతం మంటల్లో చిక్కుకొని ప్రమాదం బారిన పడే అవకాశాలు లేకపోలేదు. పైగా అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారి 163 పై ప్రయాణిస్తున్న వాహనదారులు సైతం రహదారికి ఇరువైపులా ఉన్న అడవి కాలిపోవడం వల్ల వచ్చిన పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలా అడవిలో మంటలు చెలరేగి అడవిని దహనం చేస్తున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక అధికారుల ఉనికి కనిపించకపోవడం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయక పోవటంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన వంతు బాధ్యత..
అడవిలో చెట్లను,పచ్చదనాన్ని,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆనందించడమే కాకుండా ప్రకృతి విలువైన సంపద అయినా అడవులను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది అందుకే అడవి ప్రాంతం వనభోజనాలకు వెళ్ళినప్పుడు వంటలు చేసిన అనంతరం మంటలు ఆర్పడం. బీడీ,సిగరెట్ వెలిగించి అటవీ పరిసర ప్రాంతాలలో పడవేయకుండా ఉండడం వల్ల ఎక్కువ శాతం అడవిలో మంటలు చెలరేగే ప్రమాదం తగ్గుతుంది. అడవిలో చిన్నపాటి మంటలు చెలరేగడం గమనించిన వెంటనే మన వంతు సాయంగా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించడం వెంటనే అగ్నిమాపక, అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించడం వల్ల అడవులను అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు.