దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన భీమ్లా నాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. కేవలం విడుదలైన మూడ్రోజుల్లో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో పవర్ స్టార్ రేంజ్ ఏంటో మరోసారి రుజువైంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ ప్రముఖులంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ఏకంగా సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు చెప్పారు. మెగా హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు సైతం ఇప్పటికే స్పందించారు.
కానీ, ఇటీవల పుష్ప సినిమాతో మంచి విజయం సాధించిన అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని చాలా మంది భావించారు. కానీ, ఐకాన్ స్టార్ స్పందించలేదు. అయితే, పవర్‌స్టార్ ఎప్పుడు 'పుష్ప' గురించి పెద్దగా మాట్లాడనందున, స్టైలిష్ స్టార్ భీమ్లా గురించి ఏమీ పోస్ట్ చేయకపోవచ్చని కొందరు అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ మాత్రం మెగా సినిమాల గురించి కాస్త ఆలస్యంగా మాట్లాడుతుండటం గమనార్హం. అంతేగాక, మెగా హీరోలు ఎప్పుడూ మెగా సినిమాల గురించి 'భజన' చేస్తారని ప్రేక్షకుల నుంచి బ్యాడ్ టాక్ రాకుండా ఉండటానికి కావచ్చు ఏమో అని మరి కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో 'ఏంటి పుష్ప 'భీమ్లా నాయక్' గురించి మాట్లాడవా?' అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.