కవులు, స్టోరీ టెల్లర్స్‌కు వేదిక కల్పిస్తున్న 'అన్‌ఎక్స్‌ప్లోర్డ్ మైక్'!

దిశ, ఫీచర్స్ : చిత్రలేఖనం, కవిత్వం, పాటలు సహా సాహిత్యాన్ని అభిమానిస్తూ తమలోని భావాలను, ప్రతిభను ఎగ్జిబిట్ చేసేందుకు సరైన ప్లాట్‌ఫామ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు..Latest Telugu News

Update: 2022-07-05 08:15 GMT

దిశ, ఫీచర్స్ : చిత్రలేఖనం, కవిత్వం, పాటలు సహా సాహిత్యాన్ని అభిమానిస్తూ తమలోని భావాలను, ప్రతిభను ఎగ్జిబిట్ చేసేందుకు సరైన ప్లాట్‌ఫామ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి వందలాది మంది సాహిత్యాభిమానులకు అద్భుతమైన వేదిక 'ఎక్స్‌ప్లోర్డ్ మైక్'. దక్షిణ భారతదేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో ఓపెన్ మైక్స్ ప్రొగ్రామ్స్ నిర్వహించేందుకు కళాభిమానులు అభిరామి, శ్రీకుమార్ 'అన్‌ఎక్స్‌ప్లోర్డ్ మైక్ (AUM)'ని స్థాపించారు. రెండేళ్లుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, కోయంబత్తూర్ ఈ ఓపెన్ మైక్ ఈవెంట్స్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్నాయి.

హైదరాబాద్ సింధీ కాలనీలోని ఓ అందమైన కేఫ్‌లో ఏయూఎమ్ ఇటీవలే తమ 25వ ఓపెన్ మైక్ ఈవెంట్ నిర్వహించగా సూపర్ సక్సెస్ అయింది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన 18 మంది వక్తలు కవిత్వం, స్టోరీ టెల్లింగ్, పాటల పట్ల తమ ప్రేమను పంచుకున్నారు. అనేక ఇతివృత్తాలు, కవిత్వ ప్రక్రియలు సహా అనుభవజ్ఞులైన 'షాయర్లు'(హిందీ కవులు) తమ భావాలను వ్యక్తీకరించారు. సమయ పరిమితుల కారణంగా ప్రతీ ప్రదర్శనకు 5-7 నిమిషాల టైమ్ ఇస్తారు. ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్లు రూ. 150 చెల్లించాల్సి ఉండగా, సందర్శకులు కూడా అంతే మొత్తం చెల్లించాలి.

క్వీర్ ఓపెన్ మైక్స్:

ట్రాన్స్ కమ్యూనిటీలకు సంబంధించిన సంఘటనలతో కూడిన హృదయాన్ని కదిలించే కథను హేమంత్ వివరించాడు. స్వలింగ సంపర్కం వంటి సమస్యల గురించి సామాజిక అవగాహనను వ్యాప్తి చేసేందుకు కథ చెప్పడం ఉత్తమమైన మార్గాల్లో ఒకటిగా భావించాడు. దీంతో క్వీర్ కమ్యూనిటీని మరింతగా ప్రోత్సహించేందుకు, వారి భావాలు, కళలను వ్యక్తపరిచేందుకు మరిన్ని 'క్వీర్ ఓపెన్ మైక్స్' నిర్వహించాలని AUM లక్ష్యంగా పెట్టుకుంది.

ఈసారి హైదరాబాద్‌లో చాలా మంది కొత్త ముఖాలను చూశాం. కొత్త ప్రతిభను చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరింత మంది వ్యక్తులకు చేరువవ్వడం సహా భారతదేశమంతటా కళాకారుల శ్రేణిని కనెక్ట్ చేయడమే మా లక్ష్యం. మా తదుపరి ఈవెంట్ జూలై 10న బెంగళూరులో జరగనుంది. AUM కమ్యూనిటీ Instagram (@anunexploredmic)లో కూడా ఫాలోవర్స్‌ను పెంచుకోవడం ఆనందంగా ఉంది.

- కో-ఫౌండర్ శ్రీకుమార్

అన్ ఎక్స్‌ప్లోర్డ్ మైక్ చెన్నయ్‌కి చెందిన సంస్థ. కవిత్వం, కథలు, ఇతర కళల ప్రదర్శనకు ఓపెన్ మైక్ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. 2020 మార్చిలో ఓపెన్ మైక్స్ జర్నీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 25 ఓపెన్ మైక్స్ (లైవ్) ఈవెంట్స్ నిర్వహించింది. ఆన్‌లైన్‌లోనూ ఒక ఈవెంట్ జరగ్గా.. ఒకరి మాటలు, భావాలను వాస్తవ ప్రపంచానికి తీసుకువచ్చేందుకు అనువైన వేదికను 'అన్ ఎక్స్‌ప్లోర్డ్' అందిస్తోంది.  


Similar News