ఎర్లీ డెత్ రిస్క్‌ను తప్పిస్తున్న 'వీకెండ్ వ్యాయామం'!

దిశ, ఫీచర్స్ : ఆఫీస్ వర్క్, కుటుంబ బాధ్యతలు, ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్స్‌కు తోడు విరామం లేని ఇతరత్రా పనుల వల్ల వారంలో ఒక్కరోజు కూడా వ్యాయామానికి టైమ్ సరిపోవట్లేదని చెప్పేవాళ్లు మనలో చాలామందే ఉంటారు..Latest Telugu News

Update: 2022-07-11 10:34 GMT

దిశ, ఫీచర్స్ : ఆఫీస్ వర్క్, కుటుంబ బాధ్యతలు, ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్స్‌కు తోడు విరామం లేని ఇతరత్రా పనుల వల్ల వారంలో ఒక్కరోజు కూడా వ్యాయామానికి టైమ్ సరిపోవట్లేదని చెప్పేవాళ్లు మనలో చాలామందే ఉంటారు. ఈ నేపథ్యంలో కనీసం వీకెండ్‌లో కొంత వ్యాయామం చేసినా బాడీకి ఉపయోగపడుతుందని కొత్త అధ్యయనం సూచిస్తోంది. వారం మొత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో, వారాంతంలో ఎక్సర్‌సైజ్ చేసేవారిలో 'ఎర్లీ డెత్ రిస్క్(అకాల మరణ ప్రమాదం)'ను పోల్చినపుడు గణనీయమైన తేడా కనిపించలేదని నివేదించింది. ఇది 'వీకెండ్ వారియర్స్'కు ఒక రకంగా గుడ్‌న్యూస్ వంటిదే.

పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల మిత-తీవ్ర వ్యాయామం లేదా 75 నిమిషాల ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని అమెరికా ప్రభుత్వ ఫిజికల్ యాక్టివిటీ గైడ్‌లైన్స్ వివరిస్తోంది. కొందరు అల్పాహారానికి ముందు రోజువారీ జాగింగ్ ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటే, మరికొందరు వారాంతంలో సుదీర్ఘ సైకిల్ రైడ్ ద్వారా టార్గెట్ పూర్తి చేస్తుంటారు. అయితే ఈ విభిన్న జీవనశైలి వ్యాయామం ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తల బృందం.. వీటి ద్వారా ముందస్తు మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని గుర్తించింది.

బ్రెజిల్ యూనివర్సిడేడ్ ఫెడరల్ డి సావో పాలోకు చెందిన సైంటిస్ట్ మారిసియో డాస్ శాంటోస్ నేతృత్వంలోని పరిశోధనా బృందం అమెరికాలోని 3,50,000 మంది వయోజనుల డేటాను ట్యాప్ చేసింది. ఈ డేటా ప్రకారం.. క్రమం తప్పకుండా చురుగ్గా లేదా వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ వర్కవుట్స్ చేసేవారితో పాటు వారంలో కేవలం ఒకటి లేదా రెండు సెషన్స్ చేసేవారిని వీకెండ్ వారియర్స్‌గా వర్గీకరించారు. ఈ విషయాలను సగటున 10 ఏళ్లు అనుసరించగా, శాస్త్రవేత్తలు ఆ సమయంలో దాదాపు 22,200 మరణాలను నివేదించారు. అందులో 4,000 మందికి పైగా కార్డియోవాస్కులర్ వ్యాధి కారణంగా, దాదాపు 6,000 మంది క్యాన్సర్‌తో బాధపడేవాళ్లున్నారు. అయితే వీకెండ్స్ వారియర్స్ సహా రెగ్యులర్‌గా వ్యాయామం చేసేవారైనా సరే ముందస్తు మరణ ప్రమాదాన్ని తగ్గించుకున్నట్లు రచయితలు కనుగొన్నారు. ఆసక్తికరంగా వీకెండ్స్ వారియర్స్‌కు, క్రమం తప్పకుండా చురుగ్గా వ్యాయామంలో పాల్గొనేవారి మధ్య ప్రధానంగా ఏమంత తేడా కనిపించలేదు.

నిజానికి క్రమబద్ధమైన వ్యాయామం వల్ల మానసిక స్థితితో పాటు జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. అంతేకాదు ఆందోళన లక్షణాలను తగ్గడమే కాక బాడీ యాక్టివ్‌‌నెస్ పెరగడం వంటి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇకనైనా క్రమం తప్పకుండా చేయకపోయినా.. కనీసం సెలవు రోజుల్లో, వీకెండ్స్‌లో వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆయుష్షును మెరుగుపరుచుకోవాలని సైంటిస్ట్‌లు సూచించారు. ఈ పరిశోధన జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.


Similar News