ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తొలగింపు!

న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తొలగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-07-05 15:16 GMT

న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తొలగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కి మాత్రమే కాకుండా డీజిల్‌లో వంటనూనెలు కలిపిన బయోడీజిల్‌కి కూడా పన్ను ప్రయోజనాలను ఉంటాయని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇటీవల రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన తర్వాత ఇంధనం కోసం అధిక బిల్లులను చెల్లిస్తోంది. దీనికితోడు అంతర్జాతీయంగా కూడా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతొ 12-15 శాతం ఇథనాల్ కలిపిన గ్యాసోలిన్‌పై పన్ను మినహాయింపు ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదివరకు 10 శాతం కలిసిన గ్యాసోలిన్‌కి పన్ను ప్రయోజనాలు లభించేవి.

మరోవైపు వంటనూనెల నుంచి సేకరించిన యాసిడ్స్ కలిపే ఫ్యాటీ యాసిడ్స్‌కు 20 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇంధన ధరలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు లీటర్ పెట్రోల్‌ను కొనుగోలు చేసినపుడు అందులో 15 శాతం ఇథనాల్‌ను కలిపి ఉంటే, మిగిలిన 85 శాతం పెట్రోల్‌పై మాత్రమే ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది. మిగిలిన 15 శాతం ఇథనాల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను మాత్రమే ఉంటుంది. దీనివల్ల దిగుమతి సుంకాలు, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి వీలవుతుందనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్-బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా ఇథనాల్-బ్లెండింగ్ ప్రోత్సాహం వల్ల దేశీయ చెరకు రైతులకు ఖర్చు తగ్గుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News