తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు .. రేవంత్​రెడ్డి జోస్యం

రాష్ట్రంలో మరో 12 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు.

Update: 2022-03-08 15:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో 12 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల ప్రాధాన్యత మరువలేనిదని, కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అత్యున్నత చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముగ్గురు మహిళల ప్రాధాన్యత ఉందని, సోనియా గాంధీ, సుష్మ స్వరాజ్, మీరాకుమార్ వల్లే తెలంగాణ ఏర్పడిందని రేవంత్​రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర మరువలేనిదన్నారు. రాష్ట్రంలో తాగుబోతులను తయారు చేసి మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, గల్లీలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని, సీఎం కేసీఆర్ తాగుడుకు రోల్ మోడల్‌గా మారారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని వ్యసనపరుల రాష్ట్రంగా మార్చారన్నారు.

వచ్చే కాంగ్రెస్​ సర్కారులో మహిళలకు పెద్దపీట

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ ఆరుగురు మంత్రులకు అవకాశం కల్పించిందని ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఎప్పుడు అవకాశం వచ్చినా మహిళలకు పెద్దపీట వేసిందని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ బిల్లు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలను మోడీ తొక్కిపెట్టారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మహిళా రిజర్వేషన్ తీసుకాస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మంత్రులకు అవకాశం ఇస్తామని ప్రకటించారు.

టీఆర్ఎస్​పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతుందని, టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్‌లో మహిళలకు అవకాశం లేదని మండిపడ్డారు. ఇప్పుడు కేబినెట్​లో ఇద్దరు మహిళలు ఉన్నప్పటికీ వారి శాఖలకు సంబంధించిన పవర్స్ మళ్లీ ప్రగతి భవన్‌లోనే ఉన్నాయని, రాష్ట్రంలో మహిళా భద్రత లేకుండా పోయిందన్నారు. సిటీ నడిబొడ్డున సింగరేణి కాలనీలో ముక్కు పచ్చలారని చిన్నారి హత్యకు గురైందని రేవంత్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు.. సోనియమ్మ రాజ్యం కోసం పోరాటం చేయాలని, సోనియమ్మ రాజ్యంలో మహిళలకు పెద్ద పీట ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News