వ్యాపారవేత్తగా.. ఎదగాలనుకుంటున్నారా?

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మానవ చరిత్రలోనే అత్యంత సంపన్న కాలానికి నడుమన ఉన్నాం..latest telugu news

Update: 2022-03-16 02:58 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మానవ చరిత్రలోనే అత్యంత సంపన్న కాలానికి నడుమన ఉన్నాం. పదేళ్ల కిందట ఇప్పుడున్న ఫ్యాక్టరీలు, కంపెనీల్లో సగం కూడా లేకపోగా.. నేటి బిజినెస్ ఎరాలో యువతరం కొత్త కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నారు. ఆంత్రప్యెన్యూర్స్‌, బిజినెస్ బడ్డీస్‌గా రాణిస్తూ భావితరాలకు అపార అవకాశాలను అందించడమే కాక రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు. క్లాస్, క్యాస్ట్, క్లాసిఫికేషన్స్‌, కాలిక్యులేషన్స్‌కు దూరంగా బుర్రలో మేటర్ ఉంటే వ్యాపారాన్ని ప్రారంభించడం, లాభాలు గడించడం మునుపెన్నడూ లేనంత సులభమని ఈ- తరం నిరూపిస్తోంది. ఇలా నలుగురికి నచ్చిన దారిలో కాకుండా తాము మెచ్చిన దారిలోనే ప్రయాణిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్న వారిలో మీరు ఒకరిగా ఉండాలనుకుంటున్నారా? ఆంత్రప్రెన్యూర్‌గా మారి ఆకాశాన్ని అందుకోవాలని భావిస్తున్నారా? అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

ఒకప్పుడు పాతికేళ్ల చౌరస్తాలో నిల్చుని కెరీర్‌లో ఎటువైపు వెళ్లాలనే సందిగ్ధాన్ని ఎదుర్కొనేది. నచ్చిన పని దొరక్క ఏదో ఒక ఉద్యోగంలో చేరి బతుకును వెళ్లదీసేది. కానీ ఇప్పుడు ఎంతో మంది చిన్నారులు ప్రైమరీ స్కూల్ దాటకముందే ఆంత్రప్రెన్యూర్స్‌గా మారి లక్షలు సంపాదిస్తున్నారు. వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంతో పాటు క్లయింట్స్, కస్టమర్స్‌ను పొందే విషయంలో నిన్నటి ఔత్సాహిక వ్యవస్థాపకులకు ఆందోళన ఉండేది. ఇక ఏదైనా ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావడం ఖరీదైన వ్యవహారం కావడంతో.. ఒక్కసారి విఫలమైతే జన్మలో కోలుకోలేనంత దెబ్బపడేది. కానీ ప్రస్తుతం తరం ఆ లెక్కల్ని చెరిపేసింది.

సరిహద్దులు చెరిగిపోయాయి :

గతంలో ఉన్నత సామాజిక వర్గానికి తప్ప పేద, మధ్యతరగతికి వ్యాపారాలు ప్రారంభించడమంటే ఓ సాహసంగా ఉండేది. కానీ నేటి వ్యాపారవేత్తలు జస్ట్ సోషల్ మీడియా వేదికగా బిజినెస్ రన్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ప్రొడక్ట్స్ విశేషాలు, ఫొటోగ్రాఫ్స్ పంచుకోవడంతో.. అప్పటికప్పుడే కస్టమర్స్ నుంచి లభించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తమ ఉత్పత్తిలోని లోపాలను సరిదిద్దుకుంటున్నారు. బ్రాండ్స్ అంబాసిడర్స్, ప్రమోటర్స్, అడ్వర్టైజ్‌మెంట్స్, హోర్డింగ్స్ ఖర్చులు లేకుండా సేవారంగంలోనే కాకుండా పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. నిజానికి మిలియన్ల కొద్దీ ప్రజలు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. జస్ట్ వారిని రీచ్ అయితే తమ బిజినెస్ సక్సెస్ అయినట్లేనని ఈ-తరం నమ్ముతుండగా.. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చాటిచెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డోర్ స్టెప్ సర్వీస్‌లు పెరిగిపోవడంతో బిజినెస్‌‌ సరిహద్దులు చెరిగిపోయాయి.

సీన్ మారింది..

గ్లోబల్ బిజినెస్ వరల్డ్‌పై దీర్ఘకాలంగా ఆర్థిక విజయాలు సాధిస్తున్నవారిదే ఆధిపత్యం. ఈ రోజు ఎవరైనా సరే తమ సొంత బ్రాండ్ లేదా వ్యాపారాన్ని సృష్టించేందుకు అనేక దారులున్నాయి. సోషల్ మీడియాతో పాటు అనేక సంస్థలు 'టాలెంట్ హంట్స్', 'స్టార్టప్ కాంపిటీషన్స్' నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వపరంగానూ కొత్త తరహా బిజినెస్ ఐడియాలకు ప్రోత్సాహాలు అందుతున్నాయి. 'షార్క్ ట్యాంక్స్' వంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఆలోచనాపరులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులతో పాటు మెంటార్‌షిప్ లభిస్తోంది. క్రౌడ్ ఫండింగ్‌తోనూ ఆంత్రప్యెన్యూర్ కలను నెరవేర్చుకునే అవకాశముంది.

ఫండింగ్ ఎలా పొందొచ్చు..

వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించినా డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కార్యకలాపాల విస్తరణ, మార్కెటింగ్, ఉత్పత్తిలో పెరుగుదల కోసం ప్రతి సంస్థకు నిధులు అవసరం పెరుగుతుంది. అయితే మీ వ్యాపారం ఏ దశలో ఉంది? ప్రస్తుత మార్కెట్‌లో దాని డిమాండ్ ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఆ ప్రొడక్ట్ అవసరం ఎంతమేర ఉండబోతుంది? బ్రేక్ ఈవెన్ ఎప్పుడు సాధించవచ్చు? లాభనష్టాలు, కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ వంటి వివరాలతో పాటు రాబడిని పొందగల సామర్థ్యంపై ఆధారపడి.. ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సీడ్ ఫండింగ్‌ పొందవచ్చు. ఆ డబ్బుతో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయినపుడు మరిన్ని ఫండ్ రైజింగ్ కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేందుకు క్యూ కడతాయి. 'ర్యాపిడో, లిసియస్, జెరోదా, ఐడీ ఫ్రెష్, బైజు, గ్రేట్ లెర్నింగ్, మామ ఎర్త్' వంటి కంపెనీలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక ఫండ్ రైజింగ్‌లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడో-అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్‌గా అవతరించింది. వ్యాపార యజమానులను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార వృద్ధికి ఆజ్యం పోసే లక్ష్యంతోనే ఆయా ఫండింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు :

* ప్రపంచంలో నెలకొన్న లెక్కలేనన్ని అవసరాలు, సామాజిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు శాశ్వత మార్పును సాధించే వ్యాపారాన్ని ఎంచుకోగలిగితే గణనీయ పురోగతిని సాధించడమే కాక మీ కంపెనీ లేదా బ్రాండ్ ఇమేజ్‌ కూడా షార్ట్ పీరియడ్‌లోనే పాపులారిటీ సంపాదిస్తుంది.

* ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ వేదికగా వ్యాపార అప్‌డేట్స్ అందిస్తూ ఉండాలి.

* కస్టమర్ ఇంటరాక్షన్స్ తరచుగా జరుగుతూ ఉండాలి.

* ఫీడ్‌బ్యాక్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

Tags:    

Similar News