ఆ క్రైం కట్టు కథే.. పీకే వచ్చింది కేసీఆర్‌ను పీకెయడానికే.. డీకే అరుణ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పిన క్రైం స్టోరీలో మొదటి ముద్దాయిగా కేసీఆర్‌ను, రెండో ముద్దాయిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఉంచాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆయన చెప్పిన ప్రతి లైన్, కథ, స్క్రీన్ ప్లే.. తుగ్లక్ రోడ్డు నుంచి వచ్చాయని అర్థం అవుతోందని చెప్పారు. ఈ కుట్రకు మూలం సీఎం కేసీఆర్ అని డీకే అరుణ ధ్వజమెత్తారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతనెల 23 నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, కిడ్నాప్, కేసులు, రిమాండ్లు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. వీటి అన్నీటి తర్వాతనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర అనే కొత్త కోణాన్ని తెరమీదకు తెచ్చారని అరుణ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన తన ఎన్నికల అఫిడవిట్‌ను రెండుసార్లు ట్యాంపరింగ్ చేశారని రాఘవేంద్ర రాజు పిటిషన్ వేశారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన రాఘవేంద్రరాజు తమ్ముడు నాగరాజును ఆయన షాపులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని, మరుసటిరోజు 24న యాదయ్య అనే వ్యక్తి సోషల్‌మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని ఆయనను ఎత్తుకెళ్లారని, ఆయనను తీసుకెళ్లిన కొద్దిసేపటికే విశ్వనాథ్ భాండేకర్‌ను తీసుకెళ్లారని ఇలా ఒక్కొక్కరుగా మొత్తం నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని తెలిపారు.
ఈ కిడ్నాప్‌లపై బాధిత కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకురాగా.. తాను మహబూబ్ నగర్ డీఎస్పీకి, ఎస్పీకి, లోకల్ పోలీసులకు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని ఆరోపించారు. ఆ తర్వాత వారిని ఎవరో ఎస్‌వోటీ టీం ఎత్తుకెళ్లిందని తెలిసిందని, అప్పుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు తీసుకోకుండా అవమానకరంగా మాట్లాడారని డీకే చెప్పారు. దీనిపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోలీస్ అధికారి కమల్‌హాసన్‌రెడ్డి, సీవీ ఆనంద్, మహేష్ భగవత్‌కు కాల్ చేసినా ఎవరూ ఏమీ తెలియదు అన్నారని తెలిపారు. 27న స్టీఫెన్ రవీంద్రకు కాల్ చేసి పరిస్థితిని చెప్పగా.. నిందితులను అరెస్టు చేశామని, ఫోన్లో వివరాలు చెప్పలేనని అన్నారని చెప్పారు.
ఎఫ్ఐఆర్ అంతా ఒక కట్టు కథ..
ఫారుఖ్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్‌లో 18 డిసెంబర్ 2021లో ఒక కోర్టు దగ్గర.. రాఘవేంద్ర రాజు తనను కలిసినట్లు.. తాము ఒక ప్రజాప్రతినిధి దగ్గర ఉంటామని, ఆయన తమను హింసకు గురిచేస్తున్నాడని అందుకే ఆయనను చంపాలి.. వెపన్స్ కావాలని అడిగినట్లుగా కంప్లయింట్ ఇచ్చారని ఉంది. దాని తర్వాత వారు కలిశారా? లేదా? ఏం జరిగింది అనేది తెలియదు. ఫిబ్రవరి 25వ తేదీన సుచిత్ర సమీపంలోని ఒక లాడ్జిలో నిందితులు భయపడి అక్కడ తలదాచుకున్నారని, అక్కడి నుంచి మారో మారో అని అరుస్తూ తమను వెంబడించారని, పోలీసులకు కంప్లయింట్ ఇస్తే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
ఈ కథను ఇంత బాగా ఎందుకు రక్తి కట్టించారో?
అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, మధుసూదన్ రాజు నలుగురు బ్రదర్స్. అమరేందర్ రాజు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సన్నిహితుడు, ఆయన మంత్రి వెంటే ఉంటాడు. 2014 ఎన్నికల తర్వాత నేను కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అమరేందర్ రాజు భార్య రాధను మున్సిపల్ చైర్మన్ గా గెలిపించాం. ఐదేళ్ల సమయంలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లుగా రెండున్నరేళ్లు ఒకరికి ఛాన్స్ ఇచ్చేలా చూశాం. అలా అమరేందర్ రాజు భార్య రాధ, గోపాల్‌యాదవ్ భార్యకు చెరి రెండున్నరేళ్లకోసారి పదవిలో ఉండేలా ఒప్పందం కుదిర్చాం. అయితే రాధ రెండున్నరేళ్ల తర్వాత పదవిని మరొకరికి ఇవ్వకుండా నేరుగా టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ మారిన తర్వాత వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు. రాఘవేందర్‌రాజు ఎలక్షన్ పిటిషన్ అంశంలో మమ్మల్ని కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ అఫిడవిట్ లో ట్యాంపరింగ్ చేశారని పిటిషన్ వేశానని, నాకు మాట సాయం చేయాలని, నైతిక మద్దతు కావాలని కోరాడు.
ఎలక్షన్ పిటిషన్ కేసు విత్ డ్రా చేయించాలని మంత్రి వారిని భయపెట్టాలని చూశారు. అయినా వారు వెనుకడుగు వేయకుండా పోరాడుతున్నారు. ఈ అంశంపై ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ కొనసాగుతోంది. పిటిషన్ వేశాడని వేసిన వారిని, వారి కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడమేంటి? మొత్తానికి రాఘవేందర్ రాజు అబ్‌స్కాండింగ్‌లో ఉన్నట్లు ఎఫ్ ఐఆర్‌లో చూపించారు. రాఘవేందర్ రాజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు వెళ్తున్నానని, ఎవరూ భయపడొద్దని ఇంట్లో వారికి చెప్పినట్లుగా మాకు తెలిసింది. మున్నూరు రవి ఉద్యమ విద్యార్థి నేత, కేసీఆర్ కు వీరాభిమాని.. ఆయనకు, శ్రీనివస్‌గౌడ్‌కు మధ్య ఏం విబేధాలు వచ్చాయో మాకు తెలియదు.మున్నూరు రవి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై 19 ఎకరాల 35 గుంటల ల్యాండ్ ఇష్యు పై సీఎంవోకు గతేడాది 27 ఏప్రిల్ ఫిర్యాదు చేశాడు.
సొంతపార్టీ వాళ్లే మంత్రి హరాస్‌మెంట్ తట్టుకోలేక నేతలంతా ఏకమై ఇలా చేసి ఉండొచ్చు. అందుకే మంత్రికి వ్యతిరేకంగా ఎలక్షన్ అఫిడవిట్‌కు సంబంధింఇన అంశంపై మా మద్దతు కోరారు.ఇదంతా చూస్తుంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిజంగానే ఎలక్షన్ అఫిడవిట్ ను ట్యాంపరింగ్ జరిగిందని అనిపిస్తోంది.
సూపారికీ రూ.12 కోట్లు, 15 కోట్లు అని బూటకపు మాటలు చెబుతున్నారు. అంత ఆర్థిక శక్తి ఉన్నవారెవ్వరూ అక్కడ లేరు. సినిమా స్టోరీలగా కట్టు కథ అల్లారు. కేసీఆర్ డైరెక్షన్ లో ఇది జరిగింది. సినిమాలో నెక్స్ట్యా క్షన్ ఇది అన్నట్లుగా స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పారు. మహబూబ్ నగర్ రిపోర్టర్లు ఎలాంటి వార్తలు రాయలన్నా భయపడుతున్నారు.రిపోర్టర్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.. వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఎవరు రాయడం లేదు. శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే కేసులు పెట్టించి కొట్టిస్తారు. ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఇంకా ఘోరం. ఇది కేసీఆర్ కి తెలియదా..? కేసీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా...? మీకు ఆత్మ ఉందా? లేదా?మీరు చేసే విషయాలను మీ భార్య శోభ కు చెప్పండి. ఆమె ఏం చెబుతుందో వినండి.. ఆమె మిమ్మల్ని సమర్థిస్తుందా? లేదో చూడండి.
ఉమ్మడి రాష్ట్రంలో పులిలా గర్జించిన స్టీఫెన్ రవీంద్ర ఇప్పుడు కేసీఆర్ ముందు పిల్లిలాగా మారాడు. ప్రజల పక్షాన నిలబడాల్సిన స్ట్రిక్ట్ ఆఫీసర్ అయి ఉండి ఇలా ఎలా చేస్తారు? ఇలాంటి మరక అంటించుకునేందుకు మీకు మనసొప్పుతుందా? మీరు డైనమిక్ ఆఫీసర్ అయితే ఇలాంటి తప్పుడు కేసులు బనాయించరు. బీహార్ అధికారుల చేతుల్లో, ముఖ్యమంత్రి చేతుల్లో అధికారులు కీలు బొమ్మల్లాగా మారారు. మహబూబ్ నగర్ లో మా ఇంటిపై, జితేందర్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కారు అద్దాలు ధ్వంసం చేశారు.. ఇంటిపైకి రాళ్లు రువ్వారు. నిన్న మేము అక్కడ ఉండాల్సింది.. అక్కడ ఉంటే ఇంకా ఎన్ని గొడవలు జరిగేవో. మా ఇంటిపై ఎందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుండాలను పంపారు. ఎవరి దగ్గర అల్లరి మూకలున్నాయి? ఎవరి దగ్గర గుండాలున్నారు?. బీజేపీని ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు దిగారా?.
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని పీకే సలహా ఇచ్చాడట. బెంగాల్ లో జరిగినట్లు ఇక్కడ చేస్తామంటే పీకే ను పీకి పంపిస్తాం. ఖబర్దార్ కేసీఆర్.. పీకే వచ్చింది నిన్ను పీకేయడానికే.. గుర్తుపెటుకో కేసీఆర్.. ఒక మహిళపై లేనిపోని అభాండాలు వేస్తున్నావు. నువ్ మాడి మసి అయిపోతావ్. మీ హారస్ మెంట్ బాధితులు అంతా మా దగ్గరకే వస్తారు.. గుర్తుపెట్టుకో కేసీఆర్. ఇలాంటి బోగస్ కేసులు మానుకో. అన్యాయంగా కేసులు పెట్టి ఆడవాళ్ల ఉసురు పోసుకోవద్దు.
మహబూబ్ నగర్ లో ఎన్నో దుర్మార్గాలు, అరాచకాలు జరుగుతున్నాయి.. వాటిని మీడియా బయటపెట్టాలి. ఈ కేసు విషయంలో కేసీఆర్ కు దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరి వేయాలి. శ్రీనివాస్ గౌడ్ పై కాదు.. ఆ కాన్స్‌పరసీ మా మీద జరిగిందిమొదటి ముద్దాయి కేసీఆర్.. రెండో ముద్దాయి మంత్రి శ్రీనివాస్ గౌడ్. వీళ్ళ కోసమా తెలంగాణ తెచ్చింది. శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే ఉద్యమ నాయకుడా.. ఈటల కాదా.. ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి ఉద్యమకారుడు కాదా? .