దిశ, హన్మకొండ చౌరస్తా : మహాశివరాత్రి సందర్భంగా రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వేయిస్తంభాల ఆలయానికి వచ్చిన భక్తులకు అగచాట్లు తప్పలేదు. మూడు నుంచి నాలుగు గంటల పాటు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. వీఐపీలను దర్శింపజేసుకోవడంలోనే ఆలయ అర్చకులు, అధికారులు బిజీబిజీగా ఉండటం గమనార్హం. ఓ సమయమంటూ లేకుండా వీఐపీల కోసమంటూ ఎప్పుడు పడితే అప్పుడు సామాన్య భక్తజనాన్ని నిలిపేస్తున్నారు. ప్రతీయేటా శివరాత్రి పర్వదినాన లక్షమందికి పైగా భక్తులు వేయిస్తంభాల ఆలయానికి వస్తుంటారు. ఈ సారి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. మంగళవారం ఉదయం 11 గంటల సయయానికే హన్మకొండ చౌరస్తాకు క్యూ లైన్ తట్టింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు చెప్పుల్లేకుండా క్యూ లైన్లలో రోడ్డుపై నిలబడుతూ నరకం అనుభవించారు. పిల్లాపాపాలతో వచ్చిన మహిళా భక్తులు చాలా ఇబ్బంది పడుతుండటం కనిపించింది.
దాతల పాసుల్లోని అసలు రంగు..
వేయిస్తంభాల ఆలయం స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు దాతలకు పాసులు ఏర్పాటు చేశారు. దాతలకు ఇబ్బంది కలగకుండా గౌరవంగా స్వామి వారి దర్శనం చేయించి పంపించాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దాన్ని ఆలయ అర్చకులు, అధికారులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. తమ మిత్రబృందాలకు, కుటుంబ సభ్యులకు బంధువులకు, ఇలా ఎవరికి పడితే వారికి వాటిని అందజేయడం కనిపించింది. ఫలితంగా సామాన్య భక్తులకు మూడు నాలుగు గంటల పాటు క్యూల్లో నిల్చున్న దక్కని దర్శనం సదరు పైరవీదారులకు మాత్రం క్షణాల్లోనే దర్శనం భాగ్యం కలుగుతుండటం గమనార్హం. ఇదేమిటని ప్రశ్నించిన భక్తులపైనే అర్చకులు, ఆలయ అధికారులు మాటలతో ఎదురు దాడికి దిగుతుండటం వారికే చెల్లుతోంది.
పార్కింగ్ లేక వాహనదారుల ఇక్కట్లు..
వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు ఏటా లక్షన్నరకు పైగా భక్తులు వస్తుంటారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారని తెలిసీ కూడా ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లకు పూనుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉమ్మడి వరంగల్ తో పాటు హైదరాబాద్, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వాహనాల్లో చేరుకోవడం కనిపించింది. అయితే ఆలయ పరిసరాల్లో కనీసం పార్కింగ్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోలేదు. రోడ్డుపై వాహనాలను నిలిపితే దుకాణందారులతో వాగ్వాదం ఏర్పడుతోందని భక్తులు వాపోయారు. చేసేందేం లేక బస్టాండ్‌కు వచ్చి కొంతమంది వాహనాలను పార్కింగ్ చేసి తిరిగి వేయిస్తంభాల ఆలయానికి చేరుకోవడం కనిపించింది.