కేజీబీవీ సిబ్బందిపై డీఈఓ ఆగ్రహం
దిశ, గార్ల: ఏం టైం పాస్ చేస్తున్నారా.. తమాషాలు చేస్తున్నారా.. విద్యార్థినీలు - DEO angry over KGBV staff
దిశ, గార్ల: ఏం టైం పాస్ చేస్తున్నారా.. తమాషాలు చేస్తున్నారా.. విద్యార్థినీలు ఎక్కడున్నారు.. మీరెక్కడ ఉన్నారంటూ ఉపాధ్యాయినీలపై డీఈవో అబ్దుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గార్ల మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. తనిఖీలో భాగంగా గత నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విద్యాలయం లోనికి ప్రవేశించి వీరంగం సృష్టించారు. దీంతో ఉపాధ్యాయినులు, విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఊరికి దూరంగా శివారు ప్రాంతంలో విద్యాలయం ఉండడం వల్ల పలు రకాల ఇబ్బందులు తలెత్తుతుండటంతో విద్యాలయంలో చదివే విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది.
విద్యార్థినులకు కనీస భద్రత కల్పించే సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఆకతాయిలు విద్యాలయం గోడలు దూకి లోపలికి వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొన్న తీరుపై పాఠశాల స్పెషల్ ఆఫీసర్ లలిత లీల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినీల భద్రతపై తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని, బాలికలకు భద్రతకు భరోసా కల్పించే విధంగా పాఠశాల చుట్టూరా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో నిఘా నేత్రాలు ఉన్న గదిలోనే విద్యార్థినులు నిద్రపోయేందుకు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా విష సర్పాలు దరిచేరకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని పాఠశాల సిబ్బందిని ఆయన హెచ్చరించారు.