ధాన్యం పై రైతు దిగులు.. నీటి కోసం రైతుల పాట్లు..
దిశ, లక్షెట్టిపేట: ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వ్యవసాయ బావులు, వాగులు, బోర్లు, చెరువుల కింద latest telugu news..
దిశ, లక్షెట్టిపేట: ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వ్యవసాయ బావులు, వాగులు, బోర్లు, చెరువుల కింద నీటి మట్టం తగ్గుతోంది. ఈ యాసంగి లో వరి వేసిన రైతులకు గుబులు పట్టుకుంది. యాసంగి లో వరి పంట వేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, విక్రయానికి ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించింది. రైతులు సందిగ్దంలో పడిన నీటి లభ్యత ఉన్న చాలా మంది రైతులు వరి సాగు పైనే మొగ్గు చూపారు. ప్రస్తుతం ఎండల ప్రభావం తో సాగునీటి కొరత తలెత్తడంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అని ఆందోళన మొదలైంది.
ఇదీ పరిస్థితి..
గత యేడాది యాసంగిలో లక్షెట్టిపేట మండలంలో 15,700 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 10,265 ఎకరాల్లో వరి వేశారు. ప్రభుత్వ, వ్యవసాయాధికారుల సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం పెరిగిన, గత యేడాది యాసంగి లో వరి వేసిన రైతుల్లో 30 శాతం మేరకు మాత్రమే ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపారు. మిగతా రైతులు ఆలస్యంగా నైనా బావులు, వాగులు, చెరువులు, బోర్ల కింద రైతులు వరి పంట వేశారు. గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతూ.. సాగునీటి కొరత తలెత్తడంతో రైతులు ఆందోళన మొదలైంది. వాగుల పై మోటార్లు ఉన్న రైతులు వాగుల్లో పూడిక తీస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి దిగుబడి వచ్చేది కష్టమేనని రైతులు వాపోతున్నారు.
మిల్లర్లు, దళారుల పైనే ఆధారం..
ఈ యాసంగిలో ప్రభుత్వ రంగ సంస్థ లైన సివిల్ సప్లై, ఐకేపీ, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లేకపోవడంతో మిల్లర్లు, దళారుల పైనే ఆధారపడి రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గతంలో కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర లభించగా, ఇప్పుడు మిల్లర్లు, దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ నుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వాగులు, బోర్ల కింద సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న వరి రైతులకు వచ్చే కొద్ది పాటి దిగుబడికి మిల్లర్లు ఏ మేరకు ధర చెల్లిస్తారనే బెంగ పట్టుకుంది. వరి కోతలు పూర్తయిన తర్వాత గానీ యాసంగి వరి రైతు గట్టెక్కుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.