వారి నుండి రైతాంగాన్ని కాపాడండి: సీపీఐ

దిశ, గరిడేపల్లి: ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి ప్రభుత్వమే - CPI demands opening of IKP centers

Update: 2022-03-20 12:44 GMT

దిశ, గరిడేపల్లి: ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్ ప్రారంభమై 15 రోజులు అయిందని, వారం రోజుల పాటు మిల్లర్లు సన్న రకం వడ్లను, క్వింటా రూ.2300 వరకు కొనుగోలు చేశారని, గత రెండు రోజులుగా ధాన్యం ఎక్కువ వచ్చేటప్పటికి ధరను ఒకేసారి రూ.300 తగ్గించి రూ.2000 లకే కొనుగోలు చేస్తూ.. రైతులను దోపిడీ చేస్తున్నారని.. అయిన పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ, రైతులను నిలువు దోపిడీ చేస్తుండడం వలన అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి నాయకుడు సభా వేదికలపైకి ఎక్కి.. రైతే ఈ దేశానికి వెన్నెముక, రైతు లేనిదే దేశం లేదని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వస్తారని, గద్దెనెక్కిన తర్వాత రైతులను మర్చిపోవడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. రైతు బంధు పైసలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, రైతును అన్ని విధాలా చేస్తున్న దోపిడీ తో పోల్చుకుంటే రైతుబంధు దేనికి సరిపోదని దుయ్యబట్టారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చోద్యం చూడకుండా రైతులను మిలర్లు, మధ్య దళారీల బారి నుండి కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల నాయకులు త్రిపురం సుధాకర్ రెడ్డి, కడియాల అప్పయ్య, యడ్ల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News