మణుగూరు మున్సిపాలిటీలో అవినీతి కంపు..

అధికార పార్టీ నాయకుల అండ.. ఉన్నతాధికారుల సపోర్టుతో మణుగూరు మున్సిపల్ కార్యాలయం అవినీతి కంపుగా మారింది.

Update: 2022-03-18 15:10 GMT

దిశ, మణుగూరు : అధికార పార్టీ నాయకుల అండ.. ఉన్నతాధికారుల సపోర్టుతో మణుగూరు మున్సిపల్ కార్యాలయం అవినీతి కంపుగా మారింది. ఆఫీసులోని ఓ ఇద్దరు అధికారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. వారి చేతిలో డబ్బులు పడితేనే ఫైల్ ముందుకు కదలుతుందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ పనుల్లో పైసలు ముట్టందే బిల్లలు కావు. ప్రతి పనికి పర్సంటేజీ ఇస్తేనే పని చేస్తామంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. చేసేది అవుట్ సోర్స్ ఉద్యోగమే అయినా.. ఆఫీసును తన గుప్పిట్లో పెట్టుకుని అధికారులను, కాంట్రాక్టర్లను ఆటాడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మణుగూరు మున్సిపాలిటీలో పని చేస్తోన్న ఏఈ, ఇంజనీరింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌లకు టీఆర్ఎస్ పార్టీలోని ఓ కీలక నేత, జిల్లా స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వారి సహకారంతో మున్సిపల్ పరిధిలో ఏ కాంట్రాక్ట్ వర్క్ వచ్చినా ముందుగా కాంట్రాక్టర్లతో పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మొత్తం ఇచ్చిన వారికే పని అప్పగిస్తున్నారని, డబ్బులు ముట్టిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్సంటేజీలు ఇవ్వని కాంట్రాక్టర్ల బిల్లులు, చెక్కులు ఆపేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మున్సిపల్ కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్‌ది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా మున్సిపాలిటీ కార్యాలయంలో అతడే చక్రం తిప్పుతున్నాడని అధికారులు సైతం వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు వారిపై తీసుకోవడం లేదని సొంత శాఖ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఎంబీ రికార్డులను సైతం కార్యాలయంలో కాకుండా వారి ఇళ్లలోనే తయారు చేస్తూ లక్షల రూపాయలు మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంపై నిఘా పెట్టి ఆ ఇద్దరి అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News