Minister Ponnam Prabhakar : ఆనాడు ధనిక రాష్ట్రం.. నేడు అప్పుల రాష్ట్రం..
రాష్ట్ర ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, తాము అధికారంలోకి వచ్చే నాటికి అప్పుల్లో కూరుకుపోయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
దిశ, వేములవాడ : రాష్ట్ర ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, తాము అధికారంలోకి వచ్చే నాటికి అప్పుల్లో కూరుకుపోయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శనివారం వేకువజామున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్నను దర్శించుకొని, అనంతరం రాజన్న ఆలయంతో పాటు టెక్స్టైల్, ఇరిగేషన్ రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1 లక్ష రుణమాఫీని 6 కిస్తీల్లో చెల్లిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, రూ. 2లక్షల కు పైన ఉన్న వారికి మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని, మిల్లర్లు రూ. 20 కోట్లు ధాన్యం డబ్బు చెల్లించకుండా ఉన్నారని, అలాంటి వారికి ధాన్యం ఇవ్వడం లేదని, మిల్లర్లు డబ్బులు చెల్లించి, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.
సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని, భవిష్యత్తులో రైతులు సన్న ధాన్యం సాగు చేయాలని కోరారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచామని, 19 వరంగల్ సభకు ముఖ్యమంత్రి, క్యాబినెట్ రాష్ట్ర నాయకులు వస్తున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తమ అభిప్రాయం చెప్పడానికి వీలు లేదని, ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం లేదని, ప్రజాపాలనలో స్వేచ్ఛ ఉందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని, కలెక్టర్ పై దాడిచేస్తే అరెస్టు చేయొద్దనడం సరికాదని, చట్టం తన పని తాను చేసుకువెళ్తుందని అన్నారు. అంతకుముందు రాజన్న దర్శనంలో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయానికి చేరుకున్న పొన్నం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్ లతో కలసి గుడి చెరువు పార్కింగ్ ప్రదేశంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
దేవాలయ బోర్డు ఏర్పాటుపై మంత్రి క్లారిటీ...!
మరోవైపు రాజన్న ఆలయ పాలకవర్గ ఏర్పాటు పై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న చర్చకు మంత్రి పొన్నం పులిస్టాప్ పెట్టకనే పెట్టినట్లు తెలుస్తుంది. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(వి.టీ. ఏ.డి.ఏ) ఉండగా బోర్డు వేయడానికి లేదని, బోర్డు ఏర్పాటుకు మార్గాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆశావహుల ఆశలు గల్లంతయ్యినట్లేననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చివరికి మార్గాలను పరిశీలిస్తాం అనడంతో మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దామనే ఆలోచన మొదలైంది. ఏది ఏమైనా బోర్డు ఏర్పాటు కష్టమే అనే చర్చ ఆలయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.. చూడాలి మరి ఏం జరుగుతుందో....?