సర్వే పై అపోహలు వద్దు.. ప్రజలందరూ సహకరించాలి : మంత్రి పొన్నం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు వెళ్లకుండా సర్వేకు వస్తున్న సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.
దిశ, కొండగట్టు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు వెళ్లకుండా సర్వేకు వస్తున్న సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం రోజున ఆయన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం అనంతరం ఆశీర్వచనాలు, స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసి శేష వస్త్రంతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సమగ్ర సర్వే విషయంలో ఏర్పడుతున్న అపోహలలో ఎటువంటి నిజం లేదని ప్రజల నుండి బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవడం లేదని కేవలం అకౌంట్ ఉందా లేద అనే విషయాన్ని మాత్రమే తెలుసుకుంటున్నారని ప్రతిపక్షాలు సర్వే పై అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరడంలో రాబోవు రోజుల్లో సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి ఒక్కటి నెరవేర్చినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృశ్యా మిగిలిన వాటిని కూడా తొందర్లోనే ప్రజలకు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజలందరూ ఉత్సవాలలో పాలుపంచుకోవాలని, ఇది ప్రజా ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అది రెడ్డి, నారాయణ, శంకర్ , గోల్కొండ రాజు, అజయ్, లక్ష్మణ చారి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.