రైతులతో మైండ్ గేమ్.. కోళ్ల ఫారాలపై కార్పొ"రేట్"గద్దలు.. రేటు ఫిక్స్ చేస్తున్న 'ఎంపీ'
ఇక పౌల్ట్రీ రైతులు కూడా కనుమరుగవుతున్నారు..latest telugu news
పౌల్ట్రీ ఫారాలపై కార్పొరేట్ గద్దలు వాలాయి. రైతులతో మైండ్ గేమ్ ఆడాయి. వారి వద్ద నుంచి ఏదో ఓ సాకుతో ఫారాలు లాగేసుకుంటున్నాయి. అసలు గేమ్ ఇప్పుడు షురూ చేశాయి. ఇప్పటికే చాలా పౌల్ట్రీ ఫారాల్లో రైతులు కూలీలుగా మారారు. రైతుల వద్ద ఉన్నప్పుడు కిలో 40 పలికిన లైవ్ బర్డ ధర ఇప్పుడు రూ. 148 కిచేరింది. ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 310కి పలకడం విశేషం. ఈ వ్యవహారం అంతా ఓ ఎంపీ తెరవెనుక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. ఆయనే కోళ్లకు డిమాండ్ సృష్టించడం.. ధరలు పెంచడం అనే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారని తెలిసింది.
చికెన్ ధరలు ఇలా..
నగరం | ధర (రూ.) | లైవ్ |
హైదరాబాద్ | 303 | 148 |
విజయవాడ | 210 | 130 |
బెంగళూరు | 240 | 130 |
చెన్నై | 190 | 110 |
ముంబై | 200 | 130 |
దిశ, తెలంగాణ బ్యూరో: ఇక పౌల్ట్రీ రైతులు కూడా కనుమరుగవుతున్నారు. ఇప్పటికే వ్యవసాయంపై కన్నేసిన బడా సంస్థలు.. ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ పేరుతో పౌల్ట్రీ రైతులను కూలీలుగా మార్చేశాయి. గత సీజన్ వరకు రైతుల చేతుల్లో ఉన్న కోళ్ల వ్యాపారం ఇప్పుడు పెద్దోళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంటిగ్రేషన్ ఫార్మింగ్‌కు షెడ్లను తీసుకుని.. వారి ఫారాల్లోనే రైతులను కూలీలు చేశారు. నెలల తరబడి కష్టించి కోళ్లను పెంచినందుకు కూలీ చెల్లిస్తున్నారు. ఇక వీటి ధరల్లోనూ ప్రజాప్రతినిధులు ఎంటరయ్యారు.
కోడి పిల్లల ఉత్పత్తి కోసం ఇచ్చే పేరెంట్ బర్డ్స్ కోళ్ల ధరలను ఒకటీ, రెండు హేచరీస్ సంస్థలు నిర్ణయిస్తుంటే.. కోడి పిల్లల ధరలను మాత్రం రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ ఆధ్వర్యంలో బృందం ఖరారు చేస్తున్నది. అక్కడక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఒక రేటు.. ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ నుంచి కొనుగోలు చేస్తే మరో ధరను ఖరారు చేస్తున్నారు. దీంతో మొన్నటి వరకు నాలుగైదు ఫారాల్లో కోళ్లు పెంచిన రైతులు.. ఇప్పుడు వాటిని అప్పగించి చేతులెత్తేస్తున్నారు. దీంతో చికెన్ ధర కొండెక్కింది. కేవలం 15 రోజుల్లోనే రూ.130 నుంచి రూ. 150 వరకు పెరిగింది. 15 రోజుల కిందట కిలో చికెన్ రూ.190 నుంచి రూ. 210 వరకు ఉండగా ఇప్పుడు మార్కెట్లో రూ. 303 నుంచి రూ. 310కి అమ్ముతున్నారు. అయితే ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పౌల్ట్రీ రైతులు మాయం
ఇష్టానుసారంగా పెరుగుతున్న దాణా, కోడిపిల్లల ధరలు, మార్కెట్లో నిలకడలేని కోళ్ల రేట్లు, వ్యాపారంలో బడా సంస్థలు చక్రం తిప్పుతుండటంతో పౌల్ట్రీ రైతులు నష్టాలను మూటగట్టుకొంటున్నారు. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి నిష్క్రమిస్తున్నారు. గతంలో ఫలానా సీజన్లో కోళ్లు పెంచితే లాభసాటిగా వుంటుందని పౌల్ట్రీ రైతుల్లో సరైన అంచనాలు ఉండేవి. ప్రస్తుతం అందుకు భిన్నంగా కోళ్ల ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో అంతుబట్టని రహస్యంగా మారడం ఓ కారణమే. హేచరీస్ సంస్థలు, యాజమాన్యాలు సిండికేటుగా ఏర్పడి కోడి పిల్లల ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు రైతుల నుండి వ్యక్తం అవుతున్నాయి.
రైతుల దగ్గర ఉంటే తగ్గింపే
పౌల్ట్రీ రంగాన్ని ప్రస్తుతం 80% ఇంటిగ్రేషన్ బిజినెస్ ఆక్రమించింది. కేవలం ఏడాదిలోనే బడా సంస్థలు పౌల్ట్రీ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. దీనికి రాష్ట్రం నుంచి పొలిటికల్ బృందమే బ్రోకర్‌గా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. అయితే, ఇంటిగ్రేషన్ సంస్థల ఫామ్ ల్లో కోళ్లు వుండి, అక్కడక్కడ పౌల్ట్రీ రైతుల దగ్గర కోళ్లు లేనప్పుడు అదునుగా చూసి కోళ్ల ధరలు పెంచుతున్నారనే పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్‌తో మరో చిక్కు
కష్టాలు, నష్టాలకోర్చి కోళ్లు పెంచాక చికెన్ సెంటర్లకే విక్రయించాల్సి ఉంటున్నది. ప్రస్తుతం వీధి వీధినా వెలిసిన చికెన్ సెంటర్లకు కోళ్లు విక్రయించాక డబ్బుల కోసం నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి రైతులది. కొందరు చికెన్ సెంటర్ యజమానులు పెట్టిన వాయిదాలకు డబ్బులు చెల్లిస్తుండగా, మరికొందరు నెలల తరబడి తిప్పుకోవడం, ఇంకొందరు చేతులెత్తేయడంతో ఆ నష్టాలను రైతులే భరించాల్సి వస్తున్నది. ఇదే అదనుగా పౌల్ట్రీ ఫారాలపై కార్పరేట్ సంస్థలు కన్నేశాయి. రైతులకు చిక్స్, దాణా ఇస్తూ సంరక్షించాలని సూచిస్తున్నాయి. కిలో కోడి పెంచితే రూ. 5 నుంచి రూ. 7 రూపాయలు ఇస్తున్నాయి. దీంతో వారు ఆ డబ్బులనే తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రైతుల దగ్గర కోళ్లు ఉన్నప్పుడు రూ. 40 కూడా పలుకని లైవ్ బర్డ్స్ ధర ఇప్పుడు ఇంటిగ్రేషన్ మార్కెట్లో ఏకంగా రూ. 148కి చేరడం గమనార్హం. రూ. 300 దాటిన చికెన్ రెండు రోజుల క్రితం వరకు రూ. 296గా ఉన్న కిలో చికెన్ ధర ఆదివారం ఉదయం నాటికి రూ. 303 దాటింది. రాష్ట్రంలో ప్రతిరోజూ 10 లక్షల కిలోల చికెన్ అమ్ముతుండగా, ఆదివారం స్పెషల్ గా అదనంగా మరో 15 లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో కోడి ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది.