కరీంనగర్ జిల్లాలో చాపకింద నీరులా కరోనా కేసులు
ఫోర్త్ వేవ్ ప్రభావం అంత సీరియస్ గా లేకున్నప్పటికీ కరోనా కేసులు క్రమంగా నమోదు అవుతున్నాయి.
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఫోర్త్ వేవ్ ప్రభావం అంత సీరియస్ గా లేకున్నప్పటికీ కరోనా కేసులు క్రమంగా నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా పాటిజివ్ బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ప్రమాదమేనని స్పష్టం చేస్తున్నాయి గణాంకాలు. మహమ్మారి విజృంభించకముందే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అని అంటున్నారు వైద్యులు. నామమాత్రంగానే కేసులు వస్తున్నాయన్న ధీమాను పక్కనపెట్టి కరోనా బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మాస్కు వాడడంతో పాటు కరోనా తమ దరికి చేరకుండా ఉండేందుకు పకడ్భందీగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
జూన్ 27 నుండి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 45 కేసులు నమోదు కాగా, జగిత్యాలలో 12, పెద్దపల్లిలో 12, రాజన్న సిరిసిల్లలో 5 కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 74 కేసులు నమోదు అయ్యాయి.
అప్రమత్తంగా ఉన్నాం: డీఎంహెచ్ఓ
కరోనా కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నా అప్రమత్తంగా ఉన్నామని జిల్లా వైద్యాధికారిణి జువేరియా తెలిపారు. కరోనా పాజిటివ్ బాధితులకు ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నామని, అన్ని ప్రాంతాల్లోనూ వీటిని అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి రోజు కరోనా నిర్దారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని పాజిటివ్ కేసులు ఎక్కువ శాతం నమోదు కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి కూడా వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.