విగ్రహం చుట్టూ రాజకీయం.. ఇరకాటంలో కేటీఆర్
రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్లు.. సిరిసిల్ల రాజకీయాలు ప్రస్తుతం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం చుట్టు తిరుగుతున్నాయి.
దిశ, రాజన్నసిరిసిల్ల: రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్లు.. సిరిసిల్ల రాజకీయాలు ప్రస్తుతం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం చుట్టు తిరుగుతున్నాయి. సిరిసిల్ల బైపాస్ ఎల్లమ్మ సర్కిల్లో కొండా లక్ష్మన్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సిరిసిల్ల మున్సిపల్‌లో తీర్మాణం చేశారు. కానీ సుప్రీం కోర్టు రూల్స్ ప్రకారం విగ్రహాలు ప్రధాన రహదారుల సమీపంలో పెట్టవద్దని అధికారులు అడ్డుకుంటు వస్తున్నారు. నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న సిరిసిల్ల పద్మశాలీ నేతలు ఒక్కసారిగా అధికారపార్టీపై, మంత్రి కేటీఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉన్నట్లుండి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని, కావాలనే అధికారపార్టీ నేతలు విగ్రహం పెట్టనివ్వడం లేదని, మంత్రి కేటీఆర్ స్పందించాలంటూ సోషల్ మీడియాలో మొదలైన ఈ చర్చ.. ధర్నాలు, ప్రెస్మీట్లు, అఖిలపక్ష సమావేశాల వరకు వెళ్లింది. పద్మశాలీ సంఘానికి మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం ప్రెస్మీట్లు పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుచేయాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని, రీలే దీక్షలకు పిలుపునివ్వడంతో అధికారపార్టీకి చెందిన పద్మశాలీ నేతలు అంతర్మధనంలో పడిపోయారు.
పద్మశాలీ సామాజిక వర్గం నుంచి అధికార పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేఖత వస్తుందని తెలుసుకున్న నాయకులు కేటీఆర్ క్యాంపు ఆఫీస్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. విగ్రహా ప్రతిష్టాపన ఆలస్యం అయితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చర్చించినట్లు సమాచారం. పద్మశాలీ సంఘానికి ప్రతిపక్షాలు మద్దతు పలికి కావాలనే విగ్రహా వివాదం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకత్వం చర్చించినట్లు తెలిసింది. సిరిసిల్ల జరుగుతున్న విగ్రహ వివాదం, ఆందోళనల విషయం మంత్రి కేటీఆర్కు వివరించినట్లు సమాచారం. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేటీఆర్ కానీ వ్యతిరేఖం కాదని, కోర్టు రూల్స్ను అనుసరించి ఇన్నాళ్లు కలెక్టర్లు అడ్డుకున్న విషయం పద్మశాలీ సమాజానికి వివరించాలని సమావేశంలో తీర్మాణించినట్లు సమాచారం. అయినప్పటికీ కూడా విగ్రహం పెట్టుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, తామే ముందుండి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం ఏర్పాటు చేయడం ఖాయమని, కానీ ప్రతిపక్షాల మాటలు నమ్మి సిరిసిల్ల నేతన్నలకు ఎంతో మేలు చేస్తున్న మంత్రి కేటీఆర్కు, ప్రభుత్వానికి వ్యతిరేఖ ప్రకటనలు చేయవద్దని అధికారపార్టీకి చెందిన పద్మశాలీ నాయకులు సిరిసిల్లపద్మశాలీ సంఘం నేతలకు విన్నవించినట్లు సమాచారం. రీలే నిరహార దీక్షలను వాయిదా వేయించారు.
సిరిసిల్ల చరిత్రలో పార్టీలకు అతీతంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కోసం పద్మశాలీ నాయకులు ఒక్కటి కావడం సిరిసిల్లలో తీవ్ర చర్చనీయంశమవుతుంది. సిరిసిల్ల టీఆర్ఎస్ ప్రముఖ నేత వాట్సప్గ్రూప్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని అమ్మేద్దామా.. మనం ఎలాగూ సిరిసిల్ల పెట్టం..వేరే ప్రాంతం వారు విగ్రహాన్ని అడుగుతున్నారు అంటూ చేసిన కామెంట్లు సిరిసిల్లలో వివాదం చోటు చేసుకొని ఆందోళనలు, ప్రెస్మీట్ల వరకు వెళ్లినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్తో విభేదాలు చోటు చేసుకున్న సదరు నేత గత రెండేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ తన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకుడిగా పదవి బాధ్యతలు కొనసాగిస్తున్నాడు. టీఆర్ఎస్ నేతనే ప్రారంభించిన ఈ ఉద్యమం చివరకు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేఖంగా అఖిల పక్ష పార్టీలు పోరాటం చేసే స్థాయికి వెళ్లాయన్న చర్చ సిరిసిల్లలో కొనసాగుతుంది. అధికార టీఆర్ఎస్ పద్మశాలీ నాయకులు మాత్రం కంకలేక, మింగలేక.. ఇటు కులసంఘంతో కలవక, అటు కేటీఆర్కు వ్యతిరేఖంగా మాట్లాడలేని పరిస్థితుల్లో తటస్థంగా ఉంటున్నారు.
లోలోన కొండా లక్ష్మణ్ బాపూజి విగ్రహం ఏర్పాటుచేసేందుకు అనుమతి ఇప్పించాలని సిరిసిల్ల టీఆర్ఎస్ పద్మశాలీ నాయకులు మంత్రి కేటీఆర్ను గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. కేటీఆర్ కూడా విగ్రహా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లు సమాచారం. బైపాస్ ఎల్లమ్మ సర్కిల్ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ముఖ్య నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వారం పది రోజుల్లో ఈ కార్యరూపం పూర్తికానున్నట్లు సమాచారం. ఏది ఏమైన సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం చుట్టు రాజకీయ రంగు పులుముకోవడం, అధికార పార్టీ టీఆర్ఎస్ను అంతర్మధనంలో పడివేయడం రాజకీయ చర్చకు దారి తీసింది. కుల రాజకీయాలతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.