బీజేపీకి ధీటుగా కాంగ్రెస్​ వ్యూహం.. రాహుల్​ గాంధీతో సరికొత్త ఎత్తుగడ

రాష్ట్రానికి మరోసారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఇప్పటికే రైతుల కోసం వరంగల్​ డిక్లరేషన్​ పేరుతో సభను నిర్వహించిన విషయం తెలిసిందే.

Update: 2022-07-06 00:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి మరోసారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఇప్పటికే రైతుల కోసం వరంగల్​ డిక్లరేషన్​ పేరుతో సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కేటీఆర్​ టార్గెట్​ గా సిరిసిల్లలో భారీ సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సభకు రాహుల్​ గాంధీ వస్తారని ఏఐసీసీ జనరల్​ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్​ ప్రాథమికంగా సూచించారు. రైతు డిక్లరేషన్​ తరహాలోనే యూత్​ డిక్లరేషన్​ పేరుతో మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గాలను హైదరాబాద్​ లో నిర్వహించి, భారీ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అదే తరహాలో కాంగ్రెస్​ పార్టీ కూడా భారీ సభను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

సెప్టెంబర్​ 17 టార్గెట్​

రాష్ట్ర విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ నినాదం చేస్తోంది. ఇదే అంశాన్ని కూడా కాంగ్రెస్​ తీసుకోనుంది. అదేరోజున బీజేపీ శ్రేణులు ఎలాగూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిపై కాంగ్రెస్​ సైతం దృష్టి పెట్టింది. సెప్టెంబర్​ 17న రాష్ట్రానికి రాహుల్​ ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలా అంశాలపై చర్చించిన అనంతరం రాష్ట్రానికి రాహుల్​ గాంధీ మరోసారి రావాలని కోరారు.

సిరిసిల్ల వేదిక

టీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే రాహుల్​ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుల కోసం రైతు డిక్లరేషన్​ చేయగా.. ఇప్పుడు యూత్​ టార్గెట్​ గా తీసుకుంటున్నారు. నిరుద్యోగం, యువతకు రుణాల వంటి అంశాల్లో టీఆర్​ఎస్​ చేస్తున్న మోసాలను యూత్​ కు వివరించనున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లకు సెప్టెంబర్ 17న రాహుల్​ గాంధీ రావాలని రాష్ట్ర నేతలు ఏఐసీసీ నేతలకు విన్నవించారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయాలని వివరించారు.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరేందుకు పలువురు ముఖ్య నేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంకా పార్టీలో చేరు జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణకు రాహుల్ వస్తే ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్​ చేస్తున్నారు.

Tags:    

Similar News