Yadadri: యాదాద్రి కలెక్టర్‌పై కాంగ్రెస్ నాయకుల ఫైర్.. ఎప్పుడూ ఇంతే అంటూ..
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా
దిశ,భువనగిరి రూరల్ : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ ఉంచి బీజేపీ ప్రభుత్వం వక్రబుద్ధిని ప్రదర్శించిందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించే నెపంతో విద్యుత్ ఛార్జీలు పెంచతూ సామాన్య ప్రజల పై ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు. రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు మోపుతూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వడ్లు ఐకేపీ, పీఏసీ సెంటర్లకు వస్తున్నాయని, ప్రభుత్వాలు వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
కలెక్టర్ చాంబర్ ఎదురుగా నిరసన
నిరసన దీక్ష చేపట్టిన అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేయడానికి కాంగ్రెస్ నాయకులు చాంబర్ లో వెళ్ళగా అక్కడ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆమె చాంబర్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేయడానికి వస్తే అందుబాటులో లేకపోవడం చూస్తుంటే తమ సమస్యలు పరిష్కారం చేస్తారనే నమ్మకం పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆయన మాదిరిగానే ఉద్యోగులు కూడా అహంభావంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడానికి వచ్చిన ప్రతిసారి కలెక్టర్ ఇలానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ అందుబాటులో లేనప్పుడు కనీసం అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ఇకనైనా కలెక్టర్ తమ విధానాలు మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.