మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ కుట్ర.. బయటపడ్డ సంచలన విషయాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో మరోసారి 2002 నాటి గుజరాత్ అల్లర్ల అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ

Update: 2022-07-16 09:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో మరోసారి 2002 నాటి గుజరాత్ అల్లర్ల అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని తాజాగా సిట్ పేర్కొనడం రచ్చకు కారణం అవుతోంది. ఈ కేసులో మోడీని ఇరికించేందుకు గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ దివంగంత నేత అహ్మద్ పటేల్ కుట్ర చేశారని, ఈ కుట్రలో ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ భాగస్వామ్యమయ్యారని తాజాగా గుజరాత్ పోలీసులు తమ అఫిడవిట్ లో స్పష్టం చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ఇటీవల సమర్ధించింది. ఆ మరుసటి రోజే ఈ కేసులో అమాయకులను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.

మోడీతో సహా బీజేపీ నేతలను ఇరికించే కుట్ర

పోలీసుల అదుపులో ఉన్న తీస్తా బెయిల్ దరఖాస్తును సిట్ తాజాగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సిట్ సంచలన విషయాలు వెల్లడించింది. అల్లర్ల తర్వాత రాష్ట్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర చేశారని, అతడి ఆదేశాలతోనే పెద్ద కుట్ర జరిగిందని వివరించారు.  నరేంద్ర మోడీతో సహా ఇతర బీజేపీ నేతలు, అధికారులు, అమాయక ప్రజలను ఇరికించేందుకు ఆమె చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ ఆర్థికంగానూ ప్రయోజనం పొందారని పేర్కొంది.

చనిపోయిన వారిపై రాజకీయాలా? కాంగ్రెస్ ఎదురుదాడి?

ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ పై సిట్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రాజకీయ పెద్దలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని, మరణించిన వారిని సైతం వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2002 అల్లర్ల కేసులో నరేంద్ర మోడీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ కుట్ర పన్నారన్న సిట్ అభియోగాలు చూస్తుంటే.. జరిగిన మారణ హోమంతో తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు ప్రధాని మోడీ నడుతున్న వ్యూహంలో భాగం అని అర్థం అవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని మోడీ తన రాజకీయ ప్రతీకారం కోసం దివంగతులైన ప్రత్యర్థులను సైతం విడిచిపెట్టడం లేదని.. ఇంతకు ముందు సిట్ చీఫ్ గా పని చేసిన అధికారి గుజరాత్ సీఎం కు క్లీన్ చీట్ ఇవ్వగా.. ఆ తర్వాత ఆయనకు దౌత్య పరమైన బాధ్యతలు ఎలా వచ్చాయో మాకు తెలుసని కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా పని చేసేలా మోడీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. అయితే అంశంపై అహ్మద్ పటేల్ కూతురు సైతం స్పందించారు. తన తండ్రిపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. సిట్ చేసిన ఆరోపణలే నిజమైతే 2020 వరకు తన తండ్రి బతికి ఉండగా ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఇందతా బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. కాగా 2020 లో అహ్మద్ పటేల్ మరణించారు.

కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ

ఉపరాష్ట్రపతిగా అమీద్ హన్సారీ పని చేసిన కాలంలో భారత దేశానికి చెందిన రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేశానని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం సద్దుమనగకముందే గుజరాత్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర చేశారని సిట్ పేర్కొనడంతో హస్తం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడ్డట్లయింది. ఇప్పటికే వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరుస పరిణామాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.


Similar News