దిశ ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ మున్సిపల్ పట్టణంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సి. నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున పనులు వేగవంతంగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు.
పనుల పరిశీలన అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి తో కలిసి ఆమె ఛాంబర్లో కలెక్టర్ నారాయణరెడ్డి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సంబంధిత అధికారులు, గుత్తేదార్లు, వివిధ వార్డుల కౌన్సిలర్లతో సమీక్ష జరిపారు. ఒక్కో పని వారీగా వివరాలను ఆరా తీస్తూ, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయమై నిర్దిష్ట గడువులు విధించారు. అదేవిధంగా మున్సిపల్ ఖాళీ స్థలాలను గుర్తిస్తూ వాటిని పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు, అనధికారిక లే అవుట్లు కలిగిన వెంచర్లను గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.