ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ.. ప్రత్యేక కేసుగా పరిగణించాలని విన్నపం

దిశ, తెలంగాణ బ్యూరో: ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి చాలామంది విద్యార్థులు వెనక్కి వచ్చేశారని, వారికి ఇక్కడి మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

Update: 2022-03-29 15:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి చాలామంది విద్యార్థులు వెనక్కి వచ్చేశారని, వారికి ఇక్కడి మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించాలని కోరారు. వారి చదువులు మధ్యలోనే ఆగిపోకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారిలో ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వారి సమయం, డబ్బు వృథా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. మన దేశం నుంచి వెళ్లిన సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు వెనక్కి వచ్చారని గుర్తుచేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వారిలో తెలంగాణకు చెందినవారు దాదాపు 700 మంది ఉన్నారని తెలిపారు. వారి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని పేర్కొన్నారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే 'వన్ టైమ్' ప్రక్రియగా ఈ వెసులుబాటు కల్పించాలని కోరారు. మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచడం ద్వారా మాత్రమే వారి చదువులు కొనసాగుతాయని చెప్పారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News