ఆ విషయంలో జంకుతున్న కేసీఆర్.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతాడా..?

జనంలోకి వెళ్లేందుకు గులాబీ బాస్ తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలకు రావాలని ఎమ్మెల్యేలు కోరుతున్నప్పటికీ ఎలా ముందుకుసాగాలనే ఆలోచనలో పడ్డారు.

Update: 2022-07-18 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జనంలోకి వెళ్లేందుకు గులాబీ బాస్ తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలకు రావాలని ఎమ్మెల్యేలు కోరుతున్నప్పటికీ ఎలా ముందుకుసాగాలనే ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో నిధుల కొరత వెంటాడుతుండటంతో సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు ముందుకుసాగే పరిస్థితి లేదు. ఈ తరుణంలో జిల్లాల పర్యటన సబబుకాదని భావిస్తున్నట్లు సమాచారం. జిల్లాలకు వెళ్తే పెండింగ్ పనులతో పాటు కొత్త హామీలు ఇవ్వక తప్పదని ఒక వేళ అవి నెరవేర్చకపోతే ఇవే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. దీంతో అధినేత పరిస్థితి ముందునుయ్యి.. వెనుకగొయ్యి అనే పరిస్థితి ఉండటం, జిల్లా పర్యటనపై సందిగ్ధం నెలకొనడంతో టీఆర్ఎస్ శ్రేణులు డైలామాలో పడ్డారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నప్పటికీ ప్రభుత్వంపై ప్రజల అంచనాలు రోజురోజుకు మారుతున్నాయి. దీనికి తోడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సైతం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో సైతం జాప్యం జరుగుతోంది. ఉద్యోగుల వేతనాలు సైతం ఆలస్యం అవుతుండటం, డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు దళితబంధులో ఆలస్యం, ఇంటిస్థలం ఉన్నవారికి రూ.3లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఏళ్లుగడుస్తున్నా నెరవేరకపోవడం... అభివృద్ధి పనులు పూర్తిగాకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. అంతేగాకుండా గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో నిలిచిపోయాయి. దీంతో ప్రజల్లో నానాటికి వ్యతిరేకత పెరుగుతోంది. దాని నుంచి బయటపడేందుకు పార్టీ అధినేత కేసీఆర్ పర్యటనతోనే సాధ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో జిల్లాల పర్యటన చేయాలని పలువురు నేతలు అధినేతకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కేసీఆర్ పర్యటిస్తే పెండింగ్ పనులు పూర్తితో పాటు కొత్త హామీలు ఇస్తారని, నిధులు సైతం మంజూరు చేస్తే ప్రజల దగ్గరకు సాఫీగా వెళ్లవచ్చని భావిస్తున్నారు. అయితే రాష్ట్రం ఇప్పటికే నిధుల కొరత వెంటాడుతోంది. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాకపోవడం, ప్రైవేటు నుంచి కూడా అప్పులు తీసుకునేందుకు కేంద్రం షరతులు పెట్టడంతో నిధుల సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లా పర్యటనలు సబబు కాదని అధినేత భావిస్తున్నట్లు సమాచారం.

ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని...

ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా పర్యటనల సందర్భంగా అధినేత హామీలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, దీనికి తోడు మళ్లీ ఇచ్చే హామీలు ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఫస్ట్ నిధులను సమకూర్చుకున్న తర్వాతనే జిల్లా పర్యటనలు చేయాలని అందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే కొంతకాలం జిల్లా పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

పార్టీ శ్రేణుల్లో అయోమయం...

టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్... కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్... అంతేకాదు ఎన్నికలప్పుడు కేసీఆర్ బొమ్మతోనే నేతల గెలుపు నల్లేరుపై నడకే. నేతలకు కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటిస్తే చాలు విజయం తధ్యమని ధీమా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో నేతలపై, పార్టీపై వ్యతిరేక పెరుగుతుండటంతో దానికి విరుగుడుగా కేసీఆర్ పర్యటించాలని నేతలు అభ్యర్థిస్తున్నారు. అయితే అధినేత నుంచి జిల్లాల పర్యటనకు ఎలాంటి హామీ రాకపోవడంతో కొంత నిరాశకు గురవుతున్నారు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి నేతల్లో నెలకొంది. కొన్ని జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో వాటిని ప్రారంభించేందుకైనా కేసీఆర్ వస్తాడని నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పర్యటనలపై క్లారిటీ లేకపోవడంతో పార్టీనేతల్లో డైలామా నెలకొంది.


Similar News