దళిత ద్వేషి సీఎం కేసీఆర్: మంద కృష్ణ మాదిగ
దిశ, కోదాడ: రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని latest telugu news..
దిశ, కోదాడ: రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనడం కేసీఆర్ మూర్ఖపు ఆలోచన అన్నారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సదుపాయాలు కల్పించారని అన్నారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేవు అని ఉంటే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా పెరిగిందని దానికి అనుగుణంగా రిజర్వేషన్లను పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. చాలా రాష్ట్రాలు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాయని లెక్కలతో ఆయన వివరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ జయంతి, వర్ధంతి ఉత్సవాలకు హాజరు కాకుండా దళితుల ద్వేషి గా తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మేధావులు వివిధ రాజకీయ పక్షాల సమన్వయంతో వచ్చే నెల 4న హైదరాబాద్‌లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎంఎస్‌పీ కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి కోటేష్ మాదిగ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామ కృష్ణ యాదవ్, ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్య రవి నాయక్, మైనార్టీ నాయకులు ఎస్.కె మౌలానా, జిల్లా నాయకులు యలమర్తి రాము, ఇటుకల మధు మస్టినా, ఎమ్మార్పీఎస్ ఆరు మండలాల అధ్యక్షులు పిడమర్తి వెంకట్రావు, కందుకూరి రామయ్య, బొడ్డు కుటుంబరావు, లంజపల్లి శ్రీను, కుక్కల కృష్ణ, కుడుముల రాజు, ఏపూరి సత్తిరాజు, పంది అనిల్, పిడమర్తి మధు, గోపి తదితరులు పాల్గొన్నారు.