సీఎం కూతురు చేసిందేమీ లేదు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు
దిశ, మల్యాల : సీఎం కూతురు కవిత కొండగట్టు అభివృద్ధి విషయంలో ఆశలు రేకెత్తించడం తప్ప.. చేసిందేమీ లేదని మాజీ ఎంపీ
దిశ, మల్యాల : సీఎం కూతురు కవిత కొండగట్టు అభివృద్ధి విషయంలో ఆశలు రేకెత్తించడం తప్ప.. చేసిందేమీ లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. భక్తుల కొంగు బంగారమైన కొండగట్టు అంజన్న క్షేత్రంలో ప్రతి ఏటా రూ.కోట్ల ఆదాయం ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదని వారు అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ బాధ్యుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో చేపట్టిన కొండగట్టు పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆలయ సమస్యలు అజెండాగా నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లి మరీ ఆలయ ఈవో వెంకటేష్‌కు వినతి పత్రం అందజేశారు.
ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే రవి శంకర్, ఎంపీ సంజయ్ మాటలకు మాత్రమే పరిమితం.. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాస్టర్ ప్లాన్ అమలు చేసి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. లేకుంటే 100 రోజుల్లో కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కొండగట్టుకు నయాపైసా ఇవ్వలే :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సీఎం కొండగట్టు అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదని.. అభివృద్ధి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏద్దేవా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ, నల్లగొండ, కొండగట్టు ధర్మపురి ఆలయాల అభివృద్ధికి ఇకనైనా పూనుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొంగ ఆనంద్ రెడ్డి, ఆది రెడ్డి, చిలువేరి నారాయణ, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గాజుల అజయ్, యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.