అసెంబ్లీలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - CM Jagan released the welfare calendar in the assembly

Update: 2022-03-25 10:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సంక్షేమ క్యాలెండర్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడకు ఫేర్‌వెల్ క్యాలెండర్‌గా మారనుందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 2022- 2023 ఏడాదికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను సీఎం జగన్ విడుదల చేశారు.


ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మార్చి 2023 వరకు మనందరి ప్రభుత్వం వివిధ డీబీటీల ద్వారా ఏ పథకం ఏ నెలలో అందబోతుందో వివరిస్తూ గౌరవ సభ సాక్షిగా సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాను' అని సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో-వసతి దీవెన, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు ఇచ్చే కార్యక్రమం, మే-నెలలో విద్యా దీవెన (జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి), అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌ ఖరీఫ్‌ 2021, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం, మత్య్సకార భరోసా (వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10 వేలతో పాటు డీజిల్‌ సబ్సిడీ అందజేయనున్నాం), జూన్‌ నెలలో జగనన్న అమ్మ ఒడి పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

అలాగే జూలై నెలలో -జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని సీఎం జగన్ ప్రకటించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్‌లో అవకాశం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మిగిలిపోయిన అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరరం ఆగష్టు నెలలో జగనన్న విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్‌ నెలలో వైఎస్‌ఆర్‌ చేయూత పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ సభలో ప్రకటించారు.


మరోవైపు అక్టోబర్‌ నెలలో జగనన్న వసతి దీవెన, రైతు భరోసా, నవంబర్‌ నెలలో విద్యా దీవెన( మూడవ విడత), రైతులకు వడ్డీలేని రుణాలు, డిసెంబర్‌ నెలలో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అదే సమయంలో సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్‌లో అవకాశం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మిగిలిపోయిన అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం' అని సీఎం జగన్ వెల్లడించారు.

జనవరి నెలలో రైతు భరోసా (మూడవ విడత), వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న తోడు, జనవరి మాసంలోనే పెన్షన్‌ రూ.2500 నుంచి రూ.2750కి పెంచి అందజేస్తాం. ఫిబ్రవరి నెలలో జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), జగనన్న చేదోడు పథకాలు, మార్చి నెలలో వసతి దీవెన అమలు చేస్తామని ప్రకటించారు. ఇది రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర నిరుపేద వర్గాలకు ఇది వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే చంద్రబాబుకు, అనుబంధ ఎల్లో మీడియాకు మాత్రం రుచించని క్యాలెండర్‌ అని విమర్శించారు. వారి గుండుల్లో గుబులు పుట్టించే క్యాలెండర్‌ అని హెచ్చరించారు. మరోవైపు మన పేదలకు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే.. చంద్రబాబుకు ఫేర్వెల్‌ క్యాలెండర్‌ అవుతుందని గట్టిగా చెప్పారు.

కరోనా వల్ల ఆదాయం తగ్గినా పథకాలు నిలిపివేయలేదు..

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో ఆదాయం తగ్గినా కూడా సంక్షేమ పథకాలను నిలిపివేయలేదని వెల్లడించారు. మూడేళ్లుగా తమ ప్రభుత్వం 95 శాతం హామీలు నెరవేర్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అందరూ నా వాళ్లే అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జగన్ సభలో వెల్లడించారు.


మూడేళ్లుగా తమ ప్రభుత్వం ఆచరణే తమ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కుల, మత ప్రాంతాలతో పాటు రాజకీయాలు కూడా చూడటం లేదని.. చంద్రబాబు చెప్పుకోవడానికి కూడా ఒక్క పథకం కూడా లేదని జగన్ ఎద్దేవా చేశారు.

ఈ సంవత్సరం దాదాపుగా రూ.55 వేల కోట్లు నేరుగా డీబీటీ విధానంలోనే లబ్ధిదారులకు నగదు అందజేసిన ఏకైక ప్రభుత్వం మనది. దీంతోపాటు పరోక్షంగా రూ.17,305 కోట్లు చెల్లించాం. దేశ చరిత్రలోనే ఇలాంటి డీబీటీని, పారదర్శక పాలనను ఎక్కడా, ఎవరూ కూడా ఇవ్వడం లేదు అని చెప్పడానికి గర్వపడుతున్నాం.


మనం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూడా ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నామనేది ఎలాంటి సందేహాలకు తావు లేకుండా, లబ్ధిదారులు కూడా మెరుగ్గా వారి కుటుంబ అవసరాలను ప్లాన్‌ చేసుకునే వీలును కల్పిస్తూ.. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సోషల్‌ ఆడిట్‌ పెట్టి.. ఎలాంటి లంచాలు, వివక్షకు తావులేకుండా.. ఏ నెలలో ఏ స్కీమ్‌ వస్తుందో కూడా చెబుతూ ఏకంగా క్యాలెండర్‌ను విడుదల చేసి ఆ ప్రకారంగా క్రమం తప్పకుండా అమలు చేస్తూ.. ప్రజలకు భరోసానిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Tags:    

Similar News