వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

దిశ, భువనగిరి రూరల్ : కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, రాజ్యాంగం రైతులకు latest telugu news..

Update: 2022-03-26 10:56 GMT

దిశ, భువనగిరి రూరల్ : కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, రాజ్యాంగం రైతులకు కల్పించిన హక్కులు అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యాసంగి సీజన్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయాలనే తీర్మానాన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బికూ నాయక్ బలపరచగా సభ్యులు ఆమోదించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇంత కాలం ధాన్యం కొనుగోలు సజావుగా సాగి గత యాసంగి నుంచి కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని, అందుకే కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తెస్తున్నానని, దీంతో సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా తీవ్ర సంక్షోభంలో కూడా రైతులకు మనోబలం కల్పించి రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేశామని, రైతాంగాన్ని కాపాడుకున్నామని తెలిపారు. గత సంవత్సరం కేంద్రం కోటి 45 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నదని, గత యాసంగి నుంచి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చిక్కులు పడుతుందన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టడానికి వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చి రైతాంగాన్ని దెబ్బ కొట్టిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పంటల ప్రణాళిక పై సరైన పాలసీ లేదని, కేంద్రం రాష్ట్రాలతో సయోధ్య గా ఉండాలని, కేంద్రం నుంచి రాష్ట్రాలకు సహకారం ఉండాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి టన్నుకు రూ.300 నష్టం వస్తున్నా.. రైతుల క్షేమం కోసం భరిస్తున్నామని తెలిపారు. కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలని, అందుకే గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో యాసంగిలో వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానాలను చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్, జిల్లా పరిషత్ ప్రాదేశిక, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News