ఐటీ ఫైలింగ్ చేస్తున్నారా? ఈ మినహాయింపులు మీకోసమే!
దిశ, ఫీచర్స్ : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) దాఖలుకు జులై 31 చివరి తేదీ.
దిశ, ఫీచర్స్ : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) దాఖలుకు జులై 31 చివరి తేదీ. ఇప్పటివరకు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయగా.. గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకుంటే ఫైన్ కట్టాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే ఫైలింగ్‌కు ముందు ప్రధానంగా ఎంప్లాయ్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ పలు వివరాలను వెల్లడించారు.
ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం చివరి నిమిషం వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే పోర్టల్ హ్యాంగ్ అయ్యే అవకాశంతో పాటు హడావిడిలో ఏదైనా మర్చిపోయే అవకాశముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గతేడాది ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక సమాచార వ్యవస్థ(AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార వ్యవస్థ(TIS) గురించి తెలుసుకోవాలి. ఈ మేరకు తమ ఇతర వడ్డీ ఆదాయాలను తనిఖీ చేసేందుకు ఫామ్ 26AS ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన AIS.. ఇతర మూలాలు/మ్యూచువల్ ఫండ్స్/షేర్ మార్కెట్ మొదలైన ఆదాయాల గురించి మరింత వివరణాత్మక ప్రకటన అందిస్తుంది.
పొందగలిగే మినహాయింపులు :
1. సెక్షన్ 24 : కొత్త ఇల్లు కొనుగోలుకు ఫ్రెండ్స్ లేదా బంధువుల నుంచి తీసుకున్న గృహ రుణాలపై చెల్లించిన వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు.
2. సెక్షన్ 80D : బీమాలేని సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు మీరు మెడికల్ బిల్లులు చెల్లిస్తే రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
3. సెక్షన్ 80D : ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్.. పర్సనల్, లైఫ్ పార్ట్‌నర్, డిపెండెంట్ చిల్డ్రన్ కోసం రూ. 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు.
4. సెక్షన్ 80GG : యజమాని నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందకుంటే మీ అద్దెకు రూ. 60,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
5. సెక్షన్ 80DDB : నిర్దేశిత వ్యాధులతో బాధపడుతున్న డిపెండెంట్స్ చికిత్స కోసం రూ. 40,000 తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
6. సెక్షన్ 80U/80DD : వికలాంగ పన్ను చెల్లింపుదారులు U/s 80U, డిజేబుల్డ్ డిపెండెంట్స్ u/s 80DD ద్వారా రూ. 75,000 నుంచి రూ. 1,25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
7. సెక్షన్ 80C/CCD : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 u/s 80 C , రూ. 50,000 u/s 80CCD తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
8. సెక్షన్ 80C/ 24 : మీరు ఉమ్మడి గృహ రుణగ్రహీత అయితే హోమ్ లోన్ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం రూ. 1,50,000 u/s 80C, వడ్డీ రీపేమెంట్ కోసం రూ. 2,00,000 u/s 24 క్లెయిమ్ చేయొచ్చు.
9. హిందూ అవిభాజ్య కుటుంబం(HUF).. ఒక ప్రత్యేక సంస్థ అయినందున వివిధ విభాగాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు.
10. సెక్షన్ 80G : రిజిస్టర్డ్ ధార్మిక సంస్థలు లేదా ఎన్‌జీవోలకు చేసిన విరాళాల కోసం తగ్గింపులను క్లెయిమ్ చేయొచ్చు.
11. మీ మూలధన నష్టాలను మర్చిపోవద్దు. మూలధన లాభాలపై పన్నులు చెల్లిస్తున్నప్పుడు.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా, మీరు మీ నష్టాలను లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయొచ్చు.
ఈ సంవత్సరం మీ పన్నును ఆదా చేయడానికి లేదా వచ్చే ఏడాది పన్ను ఆదా కోసం ప్లాన్ చేసేందుకు ఈ తగ్గింపులను ఉపయోగించవచ్చు.
'రిటర్న్‌ను స్వయంగా దాఖలు చేసే వ్యక్తులు తప్పనిసరిగా AIS , TISలను తనిఖీ చేయాలి. ఒకవేళ దీన్ని చెక్ చేయకుంటే, రిటర్న్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు సమాచారం వస్తుంది. దీని తర్వాత, వారు తమ సమస్యను పరిష్కారానికి సీఏలను ఆశ్రయిస్తారు. అందువల్ల ముందుగానే తనిఖీ చేసి, AISలో చూపిన మొత్తం ఆదాయాన్ని పొందుపరచడం మంచిది. ఇక పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం(TIS) అనేది పన్ను చెల్లింపుదారుల కోసం వర్గాల వారీగా రూపొందించిన సమగ్ర సమాచారం. ఇది ప్రతి సమాచార వర్గం(ఉదా. జీతం, వడ్డీ, డివిడెండ్ మొదలైనవి) కింద ప్రాసెస్ చేసిన విలువ, ఉత్పన్న విలువను చూపుతుంది
- చౌహాన్, సీఏ