"ది కాశ్మీరీ ఫైల్స్" సినిమా వారంతా చూడాలి: బీజేపీ

దిశ, సిద్దిపేట: "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాను జాతీయ వాదులు అందరూ చూడాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు..Latest Telugu News..

Update: 2022-03-18 09:59 GMT

దిశ, సిద్దిపేట: "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాను జాతీయ వాదులు అందరూ చూడాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాశ్మీర్ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా ఈనెల 11న విడుదల కాగా శుక్రవారం పట్టణంలోని ఏషియన్ బాలాజీ థియేటర్‌లో ప్రదర్శించారు. సినిమా తొలి షోను సుమారు 500 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారని చెప్పారు. ఆనాడు కాశ్మీర్ పండిట్లు, హిందువులపై జరిగిన ఘోర ఆకృత్యాలను సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారని, జరిగిన సంఘటనలు హృదయవిదారకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"ది కాశ్మీర్ ఫైల్స్" పై ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదం పన్ను తొలగించాయని చెప్పారు. తాను కూడా హిందువునని పదేపదే చెప్పుకునే సీఎం కేసీఆర్ తెలంగాణలో కూడా ఈ సినిమాపై వినోదపు పన్ను తొలగించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సినిమా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని ఆకర్షించిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ సినిమా చూసైనా చరిత్ర తెలుసుకొని మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ఎన్నో కష్ట నష్టాలు వ్యయ ప్రయాసలు తట్టుకొని ధైర్యంగా తీసిన ఈ సినిమాను చరిత్ర తెలుసుకోవడం కోసమైనా ప్రతి ఒక్కరు చూడాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News