Crypto Currency: క్రిప్టోకరెన్సీల పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
వాషింగ్టన్: భారత్‌లో క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..Latest Telugu News
వాషింగ్టన్: భారత్‌లో క్రిప్టోకరెన్సీకి(Crypto Currency) సంబంధించి ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి, అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) సంస్థకు చెందిన సెమినార్‌లో మాట్లాడుతూ.. వాటివల్ల అన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని, క్రిప్టోకరెన్సీ లను మనీ లాండరింగ్, ఉగ్రవాదం కోసం నిధులు సమీకరించడానికి ఉపయోగించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దీని పరిష్కారానికి టెక్నాలజీ సంబంధిత నియంత్రణ అవసరం ఉందని, దీనికి ఒక దేశం మాత్రమే నిర్వహించగల పరిస్థితి లేదన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సమన్వయంతో అన్ని దేశాలు నియంత్రణను కొనసాగించాలని పేర్కొన్నారు.
ఐఎంఎఫ్ సమావేశంలో పాల్గొనేందుకు నిర్మలా సీతారామన్ వాషింగ్టన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకుతో పాటు జీ 20 దేశాల ఆర్థిక మంత్రులు, ఐఎంఎఫ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అలాగే, ఈ పర్యటనలో దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇండోనేషియా మంత్రులతో చర్చించనున్నారు. ఇదే సమయంలో భారత్‌లో టెక్నాలజీ వినియోగం గురించి ప్రస్తావించిన నిర్మలా సీతారామన్.. కరోనా సంక్షోభ సమయంలో దేశంలో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిందని, అంతర్జాతీయ టెక్నాలజీ వినియోగం రేటు 64 శాతం ఉండగా, భారత్‌లో 85 శాతంగా ఉందని, సాధారణ ప్రజలు కూడా సమర్థవంతంగా టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వివరించారు.