ఈ ఏడు భక్తుల సమక్షంలోనే రాములోరి కళ్యాణం

దిశ, భద్రాచలం : భద్రాచలం దివ్యక్షేత్రంలో త్వరలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు..latest telugu news

Update: 2022-03-23 14:47 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం దివ్యక్షేత్రంలో త్వరలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 10న శ్రీ సీతారాముల వారి కళ్యాణం, ఏప్రిల్ 11న శ్రీరామ పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ వేడుకలను దగ్గరుండి జరిపిస్తుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వమే అందిస్తుంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడటంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడు భక్తుల సమక్షంలోనే మిథిలా ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుక జరగనుంది.


ఆన్ లైన్‌లో టికెట్లు..

సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరు కానున్న నేపథ్యంలో భక్తులకు యుద్ధ ప్రాతిపదికన దేవస్థానం ఏర్పాట్లను చేస్తోంది. ఆలయానికి రంగులు వేసే ప్రక్రియను ప్రారంభించారు. స్వాగత ద్వారాలను, ఆహ్వాన పత్రికలను సైతం సిద్ధం చేస్తున్నారు. ఉగాది రోజున తెలంగాణ సీఎం, ఇతర మంత్రులను, ప్రజాప్రతినిధులను 3 దేవస్థానం అధికారులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేయనున్నారు. కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం టికెట్లను ఇప్పటికే దేవస్థానం ఆన్ లైన్‌లో విక్రయం చేస్తోంది. త్వరలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశం జరుగనుంది.



Tags:    

Similar News