ఏసీబీకి పట్టుబడుతున్నా తగ్గని అవినీతి ఉద్యోగులు..

రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విసురుతున్న వలలో అవినీతి ఉద్యోగులు చిక్కుతున్నాయి.

Update: 2024-11-19 04:20 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విసురుతున్న వలలో అవినీతి ఉద్యోగులు చిక్కుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబర్ 18వ తేదీ వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 15 సంఘటనల్లో 23 మంది అవినీతి అధికారులు సిబ్బంది పై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉచితంగా పనులు చేయాల్సినా ప్రభుత్వాధికారులు సిబ్బంది కాసులకు ఆశపడడంతో ప్రజలు అవినీతి నిరోధక శాఖ అధికారులను తప్పని పరిస్థితులలో ఆశ్రయించాల్సి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిసి కూడా..

కొంతమంది అధికారులు.. సిబ్బంది.. ముక్కలేనిదే.. ముద్ద దిగదు అన్న చందంగా.. చేతులు తడవనిదే ఫైళ్లు కదలవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలు.. బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేస్తుండడంతో వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. పై అధికారులు, ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోకుండా తమ విధులను నిర్వహిస్తుండడంతో.. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నమోదు అవుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ నుంచి.. సోమవారం వరకు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిపరులను పట్టుకుంటున్న.. మిగిలిన కార్యాలయాలలో యథేచ్ఛగా అధికారులు, సిబ్బంది రేట్లు నిర్ణయించుకొని డబ్బు వసూలు చేస్తున్నారు.

ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలు..

జనవరి 20వ తేదీన కల్వకుర్తి సర్వే డిపార్ట్మెంట్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ రమావత్ పశ్య లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసులు నమోదు చేశారు. అదే నెలలో జడ్చర్ల ఎక్సైజ్ సీఐ రత్నావత్ బాలాజీ, అయిజ విద్యుత్ శాఖ లైన్మెన్ జీవరత్నం పట్టుపడ్డారు. ఫిబ్రవరి 4న మహమ్మదాబాద్ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ మహమ్మద్ ఇస్మాయిల్, ప్రైవేట్ వ్యక్తి మహమ్మద్ మూస పట్టుబడ్డారు. ఫిబ్రవరి 10న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో లంచం తీసుకుంటున్న ఏఈ పృథ్వీ పట్టుపడగా, మార్చ్ 27న గుండు మాల్ తహసీల్దార్ నినావాతో పాండు నాయక్, రికార్డు అసిస్టెంట్ చిన్న మోగులప్ప, ధరణి ఆపరేటర్ రవీందర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశారు.

మే 31 న వనపర్తి విద్యుత్ శాఖ డీఈఎం నరేందర్ కుమార్, ఎస్సీ వెంకట నాగేంద్ర కుమార్, ఈఈ మధుకర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిపోయారు. జూన్ 12న బీచుపల్లి పదో పోలీస్ బెటాలియన్ లో అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామి పట్టుబడ్డారు. జూన్ 25న వెల్దండ ఎస్సై ఎం.రవి, 102 డ్రైవర్ విక్రమ్, జులై 3న గోపాల్ పేట తహశీల్దార్ శ్రీనివాసులు, 25న మక్తల్ ఐకేపీ సర్వేయర్ బాలరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. సెప్టెంబర్ 3న మహబూబ్ నగర్ ఏసీటీవో డి.వెంకటేశ్వరరావు, అక్టోబర్ 22న పెబ్బేరు మున్సిపాలిటీ గ్రేడ్ - 2 మున్సిపల్ కమిషనర్, నవంబర్ 7న మహబూబ్ నగర్ డీఈవో రవీందర్, 18న ఇటిక్యాల పాడు ఏఈ పాండురంగారావు ఏసీబీ అధికారులకు దొరికారు. 11 నెలలలో 15 కేసులకు సంబంధించి మొత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు 24 మందిపై కేసులో నమోదు చేసి జైలుకు పంపారు.

సంచలనం కలిగించిన డీఈవో వ్యవహారం..

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ డీఈవో రవీందర్ కు సంబంధించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖలో అవినీతికి పాల్పడుతూ అధికారులు, సిబ్బంది, ఇతరులు పట్టు పడినప్పటికీ జనం అంతగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, విద్యాశాఖలో మార్గదర్శకంగా ఉండవలసిన డీఈవో అవినీతికి పాల్పడుతూ అధికారులకు దొరకారన్న సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

సమాచారం ఇవ్వండి..

ఆయా శాఖలలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఆధారాలతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న తమ కార్యాలయంలో నేరుగా కలవచ్చు అని.. లేనియెడల టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి అని ఏసీబీ డి.ఎస్.పి కృష్ణ గౌడ్ కోరారు. అవినీతికి పాల్పడుతూ దొరికిన అధికారులు సిబ్బందిని రక్షించేందుకు ఎవరు ప్రయత్నించిన వాటిని పట్టించుకోబోమని స్పష్టం చేశారు.


Similar News