రాములోరి మాన్యంపై రగడ.. రాష్ట్ర విభజనతో కొత్త లొల్లి..

దిశ, భద్రాచలం : భద్రాద్రి రాముడు బంగారు రాముడే కాదు.. కోట్లాది రూపాయల విలువ చేసే వందలాది ఎకరాల.. Latest Telugu News..

Update: 2022-03-29 14:04 GMT

దిశ, భద్రాచలం : భద్రాద్రి రాముడు బంగారు రాముడే కాదు.. కోట్లాది రూపాయల విలువ చేసే వందలాది ఎకరాల మాన్యం కలిగిన రాజాధి రాజు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా రాముని మాన్యం ఉంది. కొన్ని భూములు నుంచి దేవస్థానానికి శిస్తు రూపంలో సొమ్ము వస్తుండగా.. మరి కొన్ని భూములు ఆక్రమణలో ఉన్నాయి. అనేక సంవత్సరాల నుంచి దేవస్థానానికి సంబంధించిన భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్‌గా ఉన్న సందర్భంలో ఈ భూముల వ్యవహారం పూర్తిస్థాయిలో తేలకపోగా ఇక రాష్ట్రం విడిపోయాక తాజాగా కొత్త తరహా లొల్లి ప్రారంభమైంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించిన భద్రాచలం సమీప పురుషోత్తపట్నం గ్రామంలో ఏడు వందల ఎకరాలకు పైగానే రాముని మాన్యం ఉందని దేవస్థానం చెబుతోంది. ఇందుకు సంబంధించిన శిస్తు భూ ఆక్రమణదారులు చెల్లిస్తున్నట్లు పేర్కొంది. కానీ రెండేళ్లుగా ఆ శిస్తు కూడా సరిగా అండడం లేదని దేవస్థానం చెబుతోంది. చాలా ఏళ్లుగా ఇక్కడ రాముని మాన్యానికి సంబంధించిన వివాదం కొనసాగుతుండగా.. తాజాగా కొత్త తరహా వివాదాలు వచ్చి చేరుతున్నాయి. విభజన సమస్య ఇందుకు ఆజ్యం పోస్తోంది.

గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలి..

రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పేర్కొంటున్న.. పురుషోత్తపట్నంలో దేవస్థానం 700 ఎకరాల మాన్యం ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది. దీంతో విభజన సమస్యల లొల్లి ప్రారంభమైంది. రామాలయం తెలంగాణలో రాముని మాన్యం ఆంధ్రాలో ఉంది. దీంతో సరిహద్దు సమస్యలు ఏర్పడుతున్నాయి. భద్రాచలం దేవస్థానం అధికారులు, సిబ్బంది మంగళవారం పురుషోత్తపట్నంకు వెళ్ళు ప్రధాన రహదారి పక్కన ఇది దేవస్థానం భూమి.. ఆక్రమణ చేస్తే చట్టరీత్యా నేరం.. అనే బోర్డు పెట్టడానికి ప్రయత్నించారు. దీన్ని స్థానికులు కొందరు అడ్డుకున్నారు. ఎటువంటి బోర్డులు పెట్టాలన్నా.. తమ గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా బోర్డులు పెడతారని, అక్కడి ప్రజాప్రతినిధులు కొందరు దేవస్థానం అధికారులను ప్రశ్నించారు. కాసేపు ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దేవస్థానం తీసుకెళ్ళిన హెచ్చరిక బోర్డులను అక్కడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. చివరికి చేసే గత్యంతరం లేక బోర్డులు పెట్టకుండానే దేవస్థానం అధికారులు ఘటన ప్రాంతం నుంచి వెనుదిరిగారు. ఈ విషయంపై భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్‌ను దిశ వివరణ కోరగా జరిగిన ఘటనను రామాలయం ఈవో దృష్టికి తీసుకెళ్తున్నానని తెలిపారు.

Tags:    

Similar News