Bandi Sanjay: 'ప్రజాసంగ్రామ యాత్ర' అడ్డుకునేందుకు మహా కుట్ర.. కుందబద్దలు కొట్టిన బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ఈ మేరకు సీఎం ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా స్కెచ్ వేసినట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధమయ్యామన్నారు. రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని కోరారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, మరెన్ని అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని, యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వ నియంత-అవినీతి-కుటుంబ పాలనను పూర్తిస్థాయిలో ఎండగడతామని పునరుద్ఘాటించారు.
ఈనెల 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తమిళనాడు రాష్ట్ర్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల పార్టీ తరపున చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈనెల 7 నుండి 20 వరకు 'సామాజిక న్యాయ పక్షం' పేరిట చేపట్టే కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతు సదస్సులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వంటి అంశాలపై సమీక్షించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ను సమావేశంలో పాల్గొన్న నేతలకు బండి సంజయ్ పరిచయం చేశారు.