13 ఏళ్లకే బుక్ సిరీస్.. గిన్నిస్ రికార్డ్ సాధించిన చిన్నారి
దిశ, ఫీచర్స్ : సాధారణంగా రచయితలు తమ మొదటి పుస్తక ప్రచురణకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సాధారణంగా రచయితలు తమ మొదటి పుస్తక ప్రచురణకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు. కానీ రితాజ్ హుస్సేన్ అల్హాజ్మీ అనే 13 ఏళ్ల అమ్మాయి రాసిన మూడు పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అవగా.. నాలుగో పుస్తకం కూడా ముద్రణకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రపంచంలోనే 'బుక్ సిరీస్ ప్రచురించిన అతి పిన్న వయస్కురాలి'గా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.
సౌదీ అరేబియా, ధహ్రాన్ నగరంలో జన్మించింది రితాజ్. యువ సౌదీ ఐకాన్‌గా మారడమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచేందుకు చిన్నతనం నుంచే ఆమె ప్రయాణం మొదలైంది. అరబిక్, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం పొందిన ఈ చిన్నారి.. బాల్యంలో చాలా వరకు అడ్వెంచరస్ పుస్తకాలు చదివింది. ఈ క్రమంలో ఆరేళ్ల వయసు నుంచే రాయడం ప్రారంభించి.. రచనల ద్వారా తన అభిప్రాయాలు, ఆలోచనలు, అంతర్దృష్టులను పంచుకుంటోంది. 8 ఏళ్లకే లైబ్రరీల్లోని అనేక పుస్తకాలను చదివేసిన అలవాటే చిన్న కథలు రాసేందుకు ఆమెను ప్రేరేపించింది. ఇక 11 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సిరీస్ రచయితగా మారింది. ఈ మేరకు మొదటి రెండు పుస్తకాలు 'ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ', 'పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్' 2019లోనే అరబిక్, ఆంగ్ల భాషల్లో ప్రచురితమయ్యాయి. 2020లో 'బియాండ్ ది ఫ్యూచర్ వరల్డ్' పేరుతో మూడో నవల ప్రింట్ అయ్యింది. తనకు J K రౌలింగ్, జోవాన్ రెండెల్ వంటి రచయితలు ఇష్టమని తెలిపిన రితాజ్.. ఫ్రీ టైమ్‌లో జపనీస్ భాష నేర్చుకుంటోంది.
ఇదిలా ఉంటే.. బ్రిటన్‌కు చెందిన బెల్లా జె డార్క్ తన 5 ఏళ్ల 211 రోజుల వయసులో 'ది లాస్ట్ క్యాట్' పుస్తకాన్ని ప్రచురించి 'అతి పిన్న వయస్కురాలు(ఫిమేల్) రికార్డును కలిగి ఉంది. ఈ పుస్తకం జనవరి 31, 2022న జింజర్ ఫైర్ ప్రెస్ ద్వారా ప్రచురితమైంది.