Modi Hyderabad Tour: మోదీ సభ నేపథ్యంలో టీఆర్‌ఎస్ బిగ్ స్కెచ్.. వాటిపై ఫోకస్

Amid PM Modi Hyderabad Tour, TRS Started a flexi war with anti modi slogans| అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రచార కార్యక్రమాలు నువ్వా నేనా

Update: 2022-06-29 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: Amid PM Modi Hyderabad Tour, TRS Started a flexi war with anti modi slogans| అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రచార కార్యక్రమాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ, బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోటీ పడి మరీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో హోరెత్తిస్తున్నాయి.

బీజేపీకి ప్రచారం లేకుండా అడ్డుకట్ట?

జాతీయ సమావేశాల నేపథ్యంలో బీజేపీకి పెద్దగా ప్రచారం జరగకుండా ప్లాన్ ప్రకారం టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా మెట్రో పిల్లర్లు, హోర్డింగ్ లను ప్రభుత్వం జూలై 3 వరకు ఆయా యాడ్ ఏజెన్సీలతో బుక్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నగరంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రచార బోర్డులమీద దర్శనమిస్తుండగా, మరి కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తులు బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మోడీ సభ నిర్వహించే సికింద్రాబాద్ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకంగా 'సాలు మోడీ.. సంపకు మోడీ', 'బైబై మోడీ' అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏకంగా మోడీ సభ ప్రాంగణం సమీపంలో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడం దుమారం రేపుతోంది. వీటిని ఏర్పాటు చేసింది ఎవరూ అనేది పోలీసులు సీసీ టీవీల ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ వి చిల్లర రాజకీయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు.

బీజేపీకి రూ.50 వేల జరిమానా!

సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ఓ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 'సాలు దొర సెలవు దొర' అనే క్యాప్షన్ తో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ డిస్ ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌(సీఈసీ) అధికారులు చర్యలు తీసుకున్నారు. డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసిన నాటి నుంచి దానిని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పలు దఫాలుగా బీజేపీ నేతలను అధికారులు సంప్రదించి తొలగించాలని సూచించినా ససేమిరా అనడంతో రూ.50 వేలు ఫైన్ వేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో బ్యానర్‌, కటౌట్లు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని పేర్కొంటూ మరో రూ. 5 వేల ఫైన్ విధించారు. జరిమానా విధించినా డిజిటల్ బోర్డు ఇంకా అక్కడే ఉండటం విశేషం.

జులై 2,3 తేదీల్లో టీఆర్ఎస్ నయా స్కెచ్?

జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు మోడీ సభను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే బీజేపీ మీటింగ్స్ ప్రభావం పడకుండా కొంతలో కొంతైనా ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మోడీ, అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో అమలు చేసిన వ్యూహాన్నే ఈసారి కూడా టీఆర్ఎస్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో బీజేపీ పెద్దలు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా దినపత్రికల్లో బీజేపీకి ఫ్రంట్ పేజీ యాడ్స్ కు స్పేస్ లేకుండా టీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేశారు. అంతకు ముందే ఆ స్పేస్ ను టీఆర్ఎస్ నేతలు, పార్టీ అభిమానుల పేరుతో బుకింగ్ చేసుకున్నారు. దాంతో పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తునప్పటికీ.. పలు దినపత్రికల్లో తమ నేతలకు స్వాగతం పలుకుతూ ప్రకటనలు మొదటి పేజీలో ఇచ్చుకునే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది. తమ పార్టీ ప్రచారానికి సెకండ్ పేజీని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జులై 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ సభ ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా బీజేపీకి ఛాన్స్ లేకుండా టీఆర్ఎస్ తమకు అనుకులమైన ప్రకటనలు గంపగుత్తగా డంప్ చేసే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తంది. మొత్తంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రచారానికి సంబంధించిన రగడ రచ్చ రచ్చ చేస్తోంది.

Tags:    

Similar News