అమిత్‌షాకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన ఏఆర్.రెహమాన్!
'ఎన్ని భాషలున్నా మాతృభాషే లెస్స'. AR Rahman shares post saying 'Tamil is root of our existence'
దిశ, వెబ్‌డెస్క్ః 'ఎన్ని భాషలున్నా మాతృభాషే లెస్స'. ఇక, అవసరానికి అవసరమయ్యే ఏ ఇతర భాషనైనా నేర్చుకోవడం, అవసరం కొద్దీ మాట్లాడటం అవసరం కూడా. కానీ, అవసరానికి మించి ద్వితీయ భాషను మాట్లాడమనడం, మరో భాషనేదో జనాలపై రుద్దాలనుకోవడం కుటిల రాజకీయమే. మరో కొన్ని రోజులు తర్వాత ద్వితీయ భాషనే మాతృభాషగా చేసుకోండని అన్నా అంటారు ఆర్యులవారు! వివిధ జాతుల, భాషల నేపథ్యాల్లో జీవిస్తున్నభారతీయులందరినీ ఒకే భాషలో మాట్లాడమనడం వారి హక్కులనే కాదు, తరాల సంస్కృతిని, చివరికి వారి ఉనికినే నాశనం చేయడం అవుతుందని అప్పట్లో పెద్దలు చాలా మంది అన్నారు కూడా. ఇక, తప్పొప్పులు రాజకీయాల్లో ఉండవు గనుక ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమనుకున్న సంఘాలు, నేతలు జాతీయవాదం పేరుతో జాతినే నిర్వీర్యం చేస్తుంటారు. ఇక, ఇటీవల ఇలాంటి మాటలే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా మళ్లీ మళ్లీ అన్నారు. దేశవ్యాప్తంగా ఆయన మాటలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో ఆస్కార్-విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్. రెహమాన్ తన మాతృభాష తమిళం ప్రాముఖ్యతను, తమిళులకు 'భాష' అంటే ఏమిటో హైలైట్ చేస్తూ ఒక పోస్టర్‌ను ట్వీట్ చేశారు.
ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీపై హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనకు ఈ ట్వీట్ దిమ్మతిరిగే సమాధానమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివిధ రాష్ట్రాల ప్రజలు పరస్పరం హిందీలో మాట్లాడుకోవాలని, ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని అమిత్ షా వ్యాఖ్యానించండంపై పలు విమర్శల నేపధ్యంలో ఏఆర్ రెహమాన్ ట్వీట్ తమిళనాడుతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో దుమారం రేపింది. ఇందులో తమిళనాంగు (తమిళ దేవత) చిత్రంతో పాటు ఆధునిక తమిళ కవి భారతిదాసన్ వ్రాసిన "ఇన్బ తమిజ్ ఎంగల్ ఉరిమై సెంపయిరుక్కు వేయిర్" (తమిళం మన ఉనికికి మూలం) అనే లైన్ ఉంటుంది. ఇక, రెహమాన్ ప్రకటనకు మద్దతుగా అనేకమంది ప్రముఖ రచయితలు, నటీనటులు, పాత్రికేయులు ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట్లో సంచలనంగా మారింది.