అత్యవసర కేసులు తిరస్కరిస్తే వేటేయండి.. మంత్రి హరీష్​రావు ఆదేశాలు

ఆసుపత్రులకు వచ్చే అత్యవసర కేసులను తిరస్కరిస్తే ఖచ్చితంగా వేటు పడుతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు హెచ్చరించారు.

Update: 2022-04-04 14:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసుపత్రులకు వచ్చే అత్యవసర కేసులను తిరస్కరిస్తే ఖచ్చితంగా వేటు పడుతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు హెచ్చరించారు. సోమ‌వారం నిలోఫ‌ర్‌, గాంధీ ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అన్ని విభాగాధిప‌తుల‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగాలన్నారు. మెడిక‌ల్‌, న‌ర్సింగ్‌, పారామెడిక‌ల్ స‌హా అన్ని విభాగాల్లో సిబ్బందిని వంద శాతం నియ‌మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మ‌రింత‌ నమ్మకం పెరిగేలా సేవ‌లందించాల‌ని సూచించారు. గాంధీలో మోకాలు, తుంటి ఎముక‌ల మార్పిడి సర్జరీలతో పాటు ఇతర అవయవ మార్పిడి సర్జరీలు పెర‌గాల‌న్నారు. దీంతో పాటు సంతానోత్పత్తి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు.సీ సెక్షన్​ డెలివ‌రీలు త‌గ్గించి, సాధార‌ణ డెలివ‌రీలు ఎక్కువ‌గా జ‌రిగేలా చూడాల‌న్నారు. మాతా, శిశు మ‌ర‌ణాలు జరగకుండా చూడాలన్నారు. వివిధ విభాగాల వారీగా జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సేవలు చేరువ చేయాలనీ గాంధీ వైద్యుల‌కు సూచించారు. క‌రోనా, బ్లాక్ ఫంగ‌స్ చికిత్స విష‌యంలో గాంధీ వైద్యులు, సిబ్బంది బాగా ప‌ని చేశార‌ని అభినందించారు.

నిలోఫర్​ ఫీడ్​ బ్యాక్​బాక్స్‌లు...

నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునేందుకు వీలుగా బాక్స్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. దీని వలన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేందుకు దోహదం చేస్తుందన్నారు. ఆప‌రేష‌న్ థియేట‌ర్ సామ‌ర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల‌న్నారు. పరీక్షల ఫ‌లితాలు స‌కాలంలో రోగులకు అందించాల‌ని, వైద్య సేవ‌లు అందించ‌డంలో ఎలాంటి ఆల‌స్యం ఉండ‌కూడ‌ద‌న్నారు. నిలోఫ‌ర్ ఆసుప‌త్రి విస్తరణలో భాగంగా క‌డుతున్న నిర్మిస్తున్న 800 ప‌డ‌క‌ల బ్లాక్ ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్​ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్​రెడ్డి, టీఎస్​ఎంఎస్​ఐడీసీ ఎండీ చంద్రశేఖర్​రెడ్డి, కుటుంబ, సంక్షేమశాఖ కమిషనర్​వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్​తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News