కేసీఆర్‌పై 'ఆప్' సంచలన వ్యాఖ్యలు

Update: 2022-03-04 17:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్రంలో అనేక చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సోమ్‌నాధ్ భారతి సంచలన కామెంట్ చేశారు. కేసీఆర్‌తో గురువారం భేటీ అయిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆ వెంటనే సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్‌ను కలవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఏం జరుగుతోందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. యాంటీ బీజేపీ శక్తులతో వరుస భేటీలు అవుతున్న సీఎం కేసీఆర్ సుబ్రమణ్య స్వామితో సమావేశమై గంటకు పైగా చర్చించడం ఆసక్తి రేకెత్తించింది. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడడానికి నిరాకరించి వెళ్ళిపోయిన సుబ్రమణ్య స్వామి వెంటనే సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్‌ను కలవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

కేసీఆర్‌తో భేటీ ముగిసిన వెంటనే సుబ్రమణ్య స్వామి నేరుగా నారీమన్‌ను కలవడం యాధృచ్చికమా లేక ఒక పథకం ప్రకారమే జరుగుతున్నదా అని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరొకరు కామెంట్ చేశారు. సుబ్రమణ్యస్వామి, ఫాలీ నారీమన్ భేటీ గురించి ట్వీట్ ద్వారా సోమ్‌నాధ్ భారతి కామెంట్ చేసిన తర్వాత మీడియాతోనూ మాట్లాడారు. అవినీతిలో కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆ తర్వాత మూడు ఎకరాల భూమి పథకాన్ని ఎత్తివేశారని, దళితుడినే సీఎం చేస్తానన్న హామీని మర్చిపోయారని గుర్తుచేశారు.అన్ని పథకాల్లోనూ కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రజలకు మంచి చేసే ఫ్రంట్ ఏర్పాటు అవసరమేనని అన్నారు.

Tags:    

Similar News