కాంగ్రెస్‌కు ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాల్సిందే
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకు నిరసిస్తూ నేడు(ఏప్రిల్ 23) యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకు నిరసిస్తూ నేడు(ఏప్రిల్ 23) యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఫండ్ వచ్చిందంటూ ఈటల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈటల ఆరోపణలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు. “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్‌తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే.. నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.