సిగ్గులేకుండా పాలభిషేకాలేంటి.. కేసీఆర్‌పై YS షర్మిల సీరియస్

తెలంగాణ నిరుద్యోగులను సీఎం కేసీఆర్ కేవలం మోసం మాత్రమే కాదు ద్రోహం కూడా చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

Update: 2023-03-23 10:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగులను సీఎం కేసీఆర్ కేవలం మోసం మాత్రమే కాదు ద్రోహం కూడా చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన మహా మోసగాడిగా ఈ ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చి సిగ్గులేకుండా పాలాభిషేకాలు చేయించుకున్నారని ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్లు లేవు కొత్త జిల్లాల పాలనకు 3 లక్షలకు పైగా కొలువులు లేవని ధ్వజమెత్తారు.

బిశ్వాల్ కమిటీ లెక్కలు సూచించిన ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిడ్డ కవిత కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఢిల్లీకి పంపే విషయంలో కేసీఆర్ చూపుతున్న నిబద్ధత కడుపుకాలి, గుండె మండుతున్న నిరుద్యోగ బిడ్డల పట్ల ఎందుకు లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ దర్యాప్తు పారదర్శకంగా జరపాలని దీని వెనుక ఉన్నది ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తమపార్టీ భవిష్యత్‌లో తీవ్ర స్థాయిలో అలుపెరుగని పోరాటం చేయబోతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News