ఆ దంపతులను పొట్టనపెట్టుకున్న పాపం కేసీఆర్‌దే: YS Sharmila

మిషన్ భగీరథలో పనిచేసే 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాన్ని పెంచాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2023-07-15 12:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మిషన్ భగీరథలో పనిచేసే 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాన్ని పెంచాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. నల్లగొండలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన దంపతులను పొట్టనపెట్టుకున్న పాపం బందిపోట్ల అధ్యక్షుడు కేసీఆర్‌దే అని విమర్శించారు. గతంలో జీతాలు రావడం లేదని భర్త మహేశ్ ఆత్మహత్య చేసుకుంటే.. భార్య పుష్పలత సైతం అదే కారణంతో ప్రాణాలు విడిచిందని తెలిపారు.

అనాథలైన ఇద్దరి బిడ్డల శాపం ఈ సర్కారుకు కచ్చితంగా తగులుతుందన్నారు. అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పే మంత్రి హరీష్ రావుకైనా మిషన్ భగీరథ కార్మికుల కష్టాలు పట్టడం లేదన్నారు. ఇక చిన్న దొర ఇలాకాలో ఇల్లు రాలేదని చనిపోయిన రాజు మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలని సూచించారు. సిరిసిల్లలో ప్రభుత్వ పథకాలు అందని గడపే లేదని చెప్పుకునేందుకు సిగ్గు పడాలన్నారు. దొర పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణ్యమని, ఉరి తాళ్ళే దిక్కని తెలిపారు. జీతాల కోసం, పథకాల కోసం చేసుకొనే ఆత్మహత్యలు దొర బంగారు పాలనకు నిదర్శనమన్నారు. ఇంకో కుటుంబం ప్రాణాలు తీసుకోక ముందే మొద్దు నిద్ర వీడాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News