చేతులెత్తేసిన వైఎస్షర్మిల.. క్యాడర్‌లో కన్ఫ్యూజన్!
పాలేరు ఎన్నికల బరిలో ఈసారి నిలవడం లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించింది.
పాలేరు ఎన్నికల బరిలో ఈసారి నిలవడం లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించింది. ఏది ఏమైనా పాలేరులో పోటీ చేసేది తానే అని, వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమాన్ని కొనసాగిస్తానని ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. పాదయాత్ర సైతం చేశారు. పార్టీని నమ్ముకున్న చాలా మంది షర్మిల పార్టీలో చేరారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్న షర్మిల కాంగ్రెస్ పొత్తు కోసం విఫలయత్నం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఇంతకాలం షర్మిల బరిలో ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కాగా ఆమె నిర్ణయం పాలేరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లాభం చేకూరనున్నదనే చర్చ జరుగుతున్నది.
దిశ, ఖమ్మం రూరల్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమార్తె వై. ఎస్. షర్మిళ ఈ పార్టీని 2021 జులై 8 న ఏర్పాటు చేశారు. 2021మార్చిలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా వైఎస్సాఆర్ అభిమానులు, నాయకులతో హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన అందించడమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్నట్టు ఆమె నిర్ణయాన్ని తెలిపింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ దగ్గర ఏప్రిల్15 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ నిరుద్యోగుల కోసం ‘ఉద్యోగ దీక్ష’ పేరిట రెండు రోజులు నిరహరదీక్ష చేసింది.
ఇలా పురుడు పోసుకుంటున్న వైఎస్సార్టీపీ పార్టీ పాదయాత్ర పేరుతో పాలేరుకు వచ్చిన షర్మిల పాలేరులో పోటీ చేసేది నేనే అని ఇక్కడ మట్టి సాక్షిగా ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో పార్టీని నమ్ముకున్న చాలా మంది నాయకులు, అభిమానులు దూరమయ్యారు. కాంగ్రెస్‌లో పార్టీని కలిపేందుకు సుదీర్ఘ ప్రయత్నాలు చేసి ఫలించకపోవడంతో తాజాగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో శుక్రవారం ఆమె ప్రెస్‌మీట్‌పెట్టి పార్టీ ఈసారి ఎన్నికల్లో దూరంగా ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండేందుకే అని కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో ఇన్ని నాళ్లు పాలేరులో షర్మిల బరిలో ఉంటుందని ఆశించిన పార్టీ నాయకులకు, అభిమానులకు నిరాశే మిగిల్చిందని చెప్పాలి. చివరికి ఆమె చేతులెత్తయడంతో పాలేరులో కాంగ్రెస్నాయకులు సంతోష పడుతుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆమె మాట తప్పిందని సోషల్ మీడియాలో ట్రోల్చేస్తున్నారు.
ఎవరికి లాభం..?
వైఎస్షర్మిల నిర్ణయంతో పాలేరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లాభం చేకురనుంది అనేది అసలైన ప్రశ్న. సహజంగానే షర్మిల వైఎస్ఆర్కుమార్తె కావడంతో కాంగ్రెస్‌కే లాభం చేకురుతుందని పార్టీ నాయకుల నమ్మకం ఆశ కూడా. ఒక రకంగా వైఎస్షర్మిల బరిలో ఉంటే బీఆర్ఎస్‌కు మరింత లాభం జరిగేది. వ్యతిరేక ఓటు పంచుకోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్‌కు లాభం జరిగేదని ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. ఏది ఏమైనా షర్మిల నిర్ణయం మేరకు ఆ పార్టీ నాయకులు, అభిమానులు నడుచుకుంటారో లేక బీఆర్ఎస్ వైపు మొగ్గుచుపుతారో వేచి చూడాల్సి ఉంది. పాలేరులో కందాళ వ్యూహంతో వైఎస్ఆర్టీపీ ఓట్లు వేయించుకోగలిగితే కందాళకు తిరుగు ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.