రాంగ్ సైడ్ డ్రైవింగ్ తప్పు. కానీ ఆ సమయంలో తప్పదు.. ట్రాఫిక్ పోలీస్ పై ప్రశంసలు
యూపీఎస్సీ అభ్యర్ధిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై నెట్టింట ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ అభ్యర్ధిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై నెట్టింట ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. సంవత్సరాల పాటు కష్టపడి చదివి తీరా పరీక్ష రోజు పలు కారణాల వల్ల ఎగ్జా్మ్ సెంటర్ కు చేరుకునే సమయం ఆలస్యం అయ్యి పరీక్ష రాయలేకపోతే ఆ అభ్యర్ధి మనోవేదన వర్ణించలేనిది. ఇలాంటి ఓ అభ్యర్ధికి దు:ఖాన్ని దరిచేరకుండా చేసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఆదివారం దేశ వ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఓ మహిళ అభ్యర్ధి తాను వెళ్లాల్సిన పరీక్ష కేంద్రానికి కాకుండా మరో పరీక్ష కేంద్రానికి వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ లో ఆరా తీయగా అది వేరే చోట ఉందని, అక్కడికి వెళ్లాలని సూచించారు.
పరీక్షకు కొద్ది సమయం మాత్రమే ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రాజేంద్రనగర్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేస్ తాను దిగబెడతానని భరోసా ఇచ్చాడు. వెంటనే పోలీస్ పెట్రోలింగ్ బైక్ పై ఆమెను ఎక్కించుకొని సకాలంలో గమ్యస్థానానికి చేర్చాడు. దీనికి సంబందించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. ఇతరులకు సహాయం చేయడం ద్వారానే మనం పైకి లేస్తాము అని రాసుకొచ్చారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ తప్పు. కానీ ఆ సమయంలో తప్పదు అంటూ మెచ్చుకుంటున్నారు.