ఈ విషయాలపై ముందు మీ మామకు లేఖ రాయండి.. హరీష్ రావుకు ప్రభుత్వ విప్ కౌంటర్
హరీష్ రావు రాహుల్ గాంధీకే కాదు.. ఈ విషయాలలో కేసీఆర్ కు, కేటీఆర్ కు, కవితకు కూడా లేఖలు రాయాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ (Government Whip Ramachandra Naik) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: హరీష్ రావు రాహుల్ గాంధీకే కాదు.. ఈ విషయాలలో కేసీఆర్ కు, కేటీఆర్ కు, కవితకు కూడా లేఖలు రాయాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ (Government Whip Ramachandra Naik) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పాలనపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi)కి బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader harish Rao) లేఖ రాశారు. దీనిపై స్పందించిన రామచంద్ర నాయక్.. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా పాలన అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్దిలోకి తీసుకెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీద హరీష్ రావు రాహుల్ గాంధీకి లేఖ రాశారని తెలిపారు.
హరీష్ రావును సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామని, పదేళ్లు ప్రజాధనం కొల్లకొట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ (KCR) కు ఒక లేఖ రాయాలని, తెలంగాణలో దోపిడి సరిపోలేదన్నట్టుగా ఢిల్లీ సహా వివధ రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీ స్కామ్స్ లో జైలు పాలైన కవిత (Kavitha)కు ఒక లేఖ రాయాలని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కేటీఆర్ (KTR)కు కూడా లేఖ రాయాలని ఎద్దేవా చేశారు. అలాగే గతంలో ఇంటింటికి తిరిగి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన హరీష్ రావు బుద్ది మారాలని వేంకటేశ్వర స్వామికి కూడా ఓ లేఖ రాయాలని సూచించారు.
గత పదేళ్లలో ప్రజా గొంతుకలను నొక్కేసి, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి, రాజ్యాంగాన్ని అపహస్యం చేసి, రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనుకబాటుకు గురి చేసిన మీరే దయ్యాలు వేదాలు వల్లించినట్టు రాహుల్ గాంధీకి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా బుద్ది మార్చుకొని సక్రమంగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్న కార్యాక్రమాలపై విషప్రచారాలు చేయిస్తున్న మీ బామ్మర్ధికి, మీ మామకు లేఖలు రాయాలని హరీష్ రావుకు సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్న రేవంత్ రెడ్డి పై అడ్డుతగిలే ప్రయత్నాలు చేయవద్దని లేఖలు రాయాలని, ఇలాంటి లేఖలు మీ అవివేకానికి నిదర్శనం అని ప్రభుత్వ విప్ మండిపడ్డారు.